ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. రానున్న మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో 55 వేల ఐటీ ఉద్యోగాలను కల్పిస్తామని తెలిపారు. విశాఖలో ఐకానిక్ టవర్ల ఏర్పాటుపై మంత్రి మేకపాటి ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని యువతకు ఐటీ రంగంలో ఉన్నతమైన ఉద్యోగాలు అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఐటీ, ఎలక్ట్రానిక్ ప్రమోషన్లను మరింత పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అత్యాధునిక సాంకేతికను అందిపుచ్చుకుంటూ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచేందుకు కృషి చేస్తున్నామని మంత్రి అన్నారు.
ఎంత మందికి నైపుణ్య, శిక్షణ ఇచ్చామన్న దానిపైనే ఎన్ని ఉద్యోగాలివ్వగలిగేది ఆధార పడుతుందని మంత్రి అన్నారు. ఈ అంశంపై అధికారులు దృష్టి పెట్టాలని మేకపాటి ఆదేశించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్, మొబైల్ తయారీ, టీవీ తయారీ, స్టీల్ కంపెనీల ద్వారా త్వరలో మరింత మందికి ఉపాధి కల్పించేలా అడుగులు వేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొప్పర్తి ఈఎంసీ ద్వారా ఎక్కువ ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి వివరించారు.
ఇదిలా ఉంటే.. కోవిడ్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలమేరకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్ బాధితులకు గణనీయమైన సేవలందించింది. ఈ ఏడాది మే 1 నుండి ఈ కాల్ సెంటర్లో నమోదయిన 5,523 మంది వైద్యులు ఈ నెల 21వ తేదీ వరకూ దాదాపు 10 లక్షల మందికి పైగా కోవిడ్ బాధితులకు ఫోన్లో వైద్య సలహాలు, సూచనలు అందచేశారు. ఇందులో 1,132 మంది స్పెషలిస్టు వైద్యులున్నారు. దీంతో రికార్డు స్థాయిలో కొవిడ్ పేషెంట్లకు టెలిమెడిసన్ సేవలు అందాయి. ఈ సేవలు పొందిన వారిలో 7.20 లక్షల మంది ఇంటి నుండి చికిత్స పొందుతున్న వారే కావటం విశేషం. కోవిడ్ సమయంలో బయటకు వెళ్లలేని పరిస్థితులు కొనసాగిన నేపథ్యంలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో మాత్రమే 104 కాల్ సెంటర్ ద్వారా వైద్యులు టెలికన్సల్టేషన్ సేవలను అందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Information Technology, Job notification, JOBS, Mekapati Goutham Reddy