ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాల విడుదల చేసింది. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను ప్రకటించారు. మొత్తం 5లక్షల 19వేల 510 మంది విద్యార్థులకు సంబంధించిన ఫలితాలను వెబ్ సైట్లో ఉంచినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు http:// sults.ap.nic.in , http://results.bie.ap.gov.in/, http //results.apcfss.ac.in , https://bie.ap.gov.in/ వెబ్ సైట్లలో ఫలితాలు చూసుకోవచ్చని వెల్లడించారు. విద్యార్థులు వెబ్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం జనరల్, ఒకేషనల్ ఆప్షన్ సెలెక్ట్ చేసి అక్కడ హాల్ టికెట్ నెంబర్ తో పాటు డేట్ ఆఫ్ బర్త్ ను ఎంటర్ చేస్తే వారికి సంబంధించిన గ్రేడ్లు చూసుకోవచ్చు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పరీక్షలను రద్దు చేసి సెకండ్ ఇయర్ విద్యార్థులను ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆదిమూలపు సురేష్ తెలిపారు.
ప్రస్తుతం సెకండ్ ఇయర్ విద్యార్థులు 2019 రాసిన టెన్త్ పరీక్షలు, 2020లో రాసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించారు. ఇందులో పదోతరగతి మార్కులకు 30శాతం, బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు ప్రథమ సంవత్సరంతో పాటు ఇటీవల నిర్వహించిన ప్రాక్టికల్స్ పరీక్షలతో కలిపి 70శాతం చొప్పున వెయిటేజీ తీసుకొని రెండో ఏడాదికి వంద శాతానికి మార్కులు లెక్కగట్టారు. రిటైర్డ్ ఐఏఎస్ ఛాయరతన్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ గ్రేడ్లను లెక్కగట్టింది.
ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు మంత్రి సురేష్ ప్రకటించారు. ఐతే ఇలా పాస్ చేయడం నచ్చని వారు కోరుకుంటే పరీక్షలు రాయవచ్చని తెలిపారు. పరీక్షలు ఎప్పుడు అనేది త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపారు. దీనిపై త్వరలోనే కమిటీని నియమిస్తామన్నారు.
ఇదిలా ఉంటే పాఠశాలల పునఃప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా మూతబడిన పాఠశాలలను తిరిగి ప్రారంభించే తేదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఖరారు చేశారు. ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునర్ ప్రారంభం చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. విద్యాశాఖ, నాడు-నేడుపై మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. ఈ సమావేశంలోనే పాఠశాలల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకున్నారు. మొదటి విడత నాడు నేడు పనులను కూడా అదే రోజు ప్రజలకు అంకితం చేయనున్నట్లు ప్రకింటారు. అలాగే రెండో విడత నాడు-నేడు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నూతన విద్యా విధానంపై అదే రోజు సమగ్రంగా వివరించనున్నట్లు ప్రకటిచింది. అలాగే జగనన్న విద్యాకానుక కిట్లు కూడా అదే రోజు అందజేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.