ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో పాఠశాల దశ నుంచి ఇంగ్లీష్ మీడియం ఉండాలని పట్టుదలతో ఉన్న సీఎం జగన్ ఆ దిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 2021–22 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కోర్సులన్నీ ఇకపై ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో అన్ని ప్రైవేటు ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ కాలేజీలు తెలుగు మీడియం కోర్సులను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చుకోవాలని ఉన్నత విద్యా మండలి సూచన చేసింది. ఈ మేరకు మండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్‌కుమార్ ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలు రానున్న కొత్త విద్యా సంవత్సరం నుండి ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే ప్రోగ్రాములను అందించాలని గత ఫిబ్రవరి 12న ఉన్నత విద్యపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం జగన్ స్పష్టంగా చెప్పడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం కొత్త, అదనపు ప్రోగ్రామ్‌ల మంజూరు.. ఆయా కోర్సుల కాంబినేషన్ మార్పు, ప్రస్తుతం నడుస్తున్న మాధ్యమాన్ని ఇంగ్లిష్ మీడియంలోకి మార్చుకునేందుకు ఉన్నత విద్యా మండలి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించింది.
2021–22 విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల అన్‌ఎయిడెడ్ అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) హానర్స్ ప్రోగ్రాముల కోసం దరఖాస్తులను ఆంగ్ల మాధ్యమానికి మాత్రమే అనుమతిస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇప్పటికే తెలుగు మాధ్యమంలో అన్‌ఎయిడెడ్ కోర్సులను అందిస్తున్న అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు, ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలు ప్రస్తుతం ఉన్న అన్ని తెలుగు మీడియం విభాగాలను ఇంగ్లిష్ మీడియంలోకి మార్చుకునేందుకు ప్రతిపాదనను పంపించాలని మండలి సూచనలు చేసింది.
ఇదీ చదవండి: రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి..! సీఎం జగన్ వ్యూహం ఫలిస్తుందా..?
లాంగ్వేజ్ కోర్సులను మినహాయించి ఇతర విభాగాల కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చడానికి ఈనెల 18 నుంచి 28వ తేదీలోపు ఉన్నత విద్యా మండలికి ప్రతిపాదనలు సమర్పించాలని ప్రభుత్వం పేర్కొంది. అలా ఇవ్వని పక్షంలో 2021–22 నుండి ఆయా కోర్సుల నిర్వహణకు అనుమతి ఇవ్వలేం అని అధికారులు స్పష్టం చేశారు. గడువు దాటిన తరువాత ఎలాంటి ప్రతిపాదనలను స్వీకరించే అవకాశం లేదని స్పష్టం చేశారు. అలాగే, అన్‌ఎయిడెడ్ ప్రోగ్రాములలో నిర్వహణ సాధ్యంకాని, నిర్వహించని యూజీ ప్రోగ్రాములను ఉపసంహరించుకోవాలనుకునే ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, ప్రైవేట్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు తమ ప్రతిపాదనలను కూడా ఈనెల 18 నుంచి 28లోగా సమర్పించాలని సూచించింది. మీడియం మార్పిడి, ప్రోగ్రామ్‌ల ఉపసంహరణకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదని మండలి పేర్కొంది. అయితే ఇప్పటికే తెలుగు మీడియం చదువుతున్న 65,981 మంది విద్యార్థులు యధాతథంగా ఆయా కోర్సుల్లో కొనసాగే అవకాశం కల్పించింది. 2021–22 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా చేరే విద్యార్థులకు మాత్రమే ఇంగ్లిష్ మీడియం అమలవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, AP News, Degree students, EDUCATION