ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు నెల్లూరు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్టు రెండో విడత అమ్మఒడి పథకాన్ని ఆయన నెల్లూరు నుంచి ప్రారంభించనున్నారు. ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో నెల్లూరుకు పయనం అవుతారు. 11.10 గంటలకు నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నెల్లూరులోని శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల గ్రౌండ్‌కు చేరుకుంటారు. 11.40కి అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శిస్తారు. అనంతరం బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకొని అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభిస్తారు. ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లికి బయలుదేరుతారు.
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయంలో జగనన్న అమ్మఒడి పథకం నిధులు అందుతాయా? లేదా అనే సందేహం కొందరిలో నెలకొంది. ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ఓ ప్రకటన చేశారు. ‘అమ్మ ఒడి పథకం యథాతథంగా అమలు చేస్తాం. ఇప్పటికే జీవో నెంబర్ 3 విడుదల చేశాం. 44,08,921 మందికి అమ్మ ఒడి వర్తిస్తుంది. రూ.6,612 కోట్లతో అమ్మ ఒడి అమలు చేసి తీరతాం. సోమవారం (జనవరి 11) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతా ల్లో డబ్బు జమ చేస్తారు. అమ్మఒడిని ఆపే ప్రసక్తే లేదు.’ అని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు.
తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణం తర్వాత అక్కడ ఉప ఎన్నిక రానుంది. అయితే, దీనిపై ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి షెడ్యూల్ విడుదల కాలేదు. తిరుపతి లోక్‌సభ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాలు నెల్లూరు జిల్లాలో ఉంటాయి. సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలు నెల్లూరు జిల్లా కిందే ఉన్నాయి. ఈ క్రమంలో జగన్ నెల్లూరు పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఎన్నికల్లో గెలిచినట్టే ఈ ఉప ఎన్నికల్లో కూడా వైసీపీకి భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి నేరుగా తిరుపతి నుంచి కాకుండా నెల్లూరు వైపు నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Navaratnalu