భారత్‌లో అమెజాన్ ఉద్యోగులకు కంపెనీ గట్టి షాకిచ్చింది. దాదాపు 1000 మందికి పైగా ఉద్యోగులను తీసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థిక మాంద్యం ముప్పు నేపథ్యంలో కంపెనీలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఆయా కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించి షాకిస్తున్నాయి. అమెజాన్ కూడా తమ సంస్థలోని ఉద్యోగులకు లేఆఫ్స్ ఇస్తున్నట్లు ప్రకటించినట్లు తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు అమెజాన్ ఇండియా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను మొదలు పెట్టింది.
ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో లక్ష మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ఒక శాతం సిబ్బందిపై అంటే 1000 మందిపై వేటు పడనుంది. ఈ విషయమై ఇప్పటికే ఆయా ఉద్యోగులకు అమెజాన్ ఇండియా మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. సదరు ఉద్యోగులతో తెగతెంపులు చేసుకోవడానికి 5 నెలల వేతనాన్ని తొలగింపు పరిహారంగా (Severance Pay) అందజేస్తామంటూ హామీ ఇచ్చినట్లు సమాచారం. మరిన్ని వివరాలకు వారి వారి టీం లీడర్లను సంప్రదించాలని మెయిల్‌లో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ తొలగింపు ప్రక్రియలో అమెజాన్ స్టోర్‌లలో పనిచేసే ఉద్యోగులు, PXT(People, Experience,Technology) విభాగాల్లో పనిచేసే ఉద్యోగులపైనే అధిక వేటు పడినట్లు వార్తలు వస్తున్నాయి.
అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో నెలకొనడంతో భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసివేస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గతేడాది నవంబరులో సంస్థ వెల్లడించింది. అందులో భాగంగా భారత్‌లోనూ దాదాపు 1000 మందిపై వేటు వేస్తున్నట్లు అమెజాన్ స్పష్టం చేసింది. ‘ఉద్యోగులను తగ్గించుకుంటున్నట్లు మేం గతేడాది నవంబరులోనే ప్రకటించాం. ప్రపంచవ్యాప్తంగా 18,000 మందిని తీసివేయాలని అనుకున్నాం. ఈ నిర్ణయంతో ఎన్నో విభాగాల్లో అలజడి మొదలైంది. అయితే, అమెజాన్ స్టోర్, PXT ఆర్గనైజేషన్‌లోని ఉద్యోగులే అధికంగా నష్టపోయారు’ అని అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ తన బ్లాగులో పేర్కొన్నారు.
2021 డిసెంబర్ 21 నాటికి అమెజాన్ సంస్జలో 16,08,000 మంది ఫుల్ టైం, పార్ట్ టైం ఉద్యోగులున్నారు. అయితే, PXT ఆర్గనైజేషన్‌లోని ఉద్యోగుల్లో కొందరికి స్వచ్ఛందంగా వైదొలిగే ఆఫర్‌ని కంపెనీ ప్రకటించింది. డివైజెస్, బుక్స్ బిజినెస్‌లలోని ఉద్యోగులను తొలగించడానికి కూడా అమెజాన్ నిర్ణయించుకోవడం గమనార్హం.
అమెజాన్‌తో పాటు మైక్రోసాఫ్ట్, గూగుల్ , మెటా, ట్విటర్, సేల్స్‌ఫోర్స్ వంటి దిగ్గజాలు కూడా ఉద్యోగాల్లో కోత విధించాయి. అమెరికాలో ఆర్థిక మాంద్యం ముప్పు రోజురోజుకు తీవ్రమవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయాలు తీసుకొన్నాయి. ఫలితంగా ఒక్కో సంస్థలో వేల మంది ఉద్యోగులపై ఈ నిర్ణయం ప్రభావం చూపుతోంది. విదేశాల్లో జాబ్ వీసాపై ఉంటున్న ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉన్నఫలంగా ఉద్యోగాల నుంచి తీసివేయడం, వీసా గడువు దగ్గర పడుతుండటంతో ఉద్యోగులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దీంతో వివిధ ప్లాట్‌ఫాంలలో ఉద్యోగాల కోసం అర్జీలు పెట్టుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, IT jobs, JOBS, Layoffs, Private Jobs