హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Sainik schools: దేశంలోని బాలికలకు ప్రధాని మోదీ శుభవార్త.. ఎర్రకోట నుంచి కీలక ప్రకటన

Sainik schools: దేశంలోని బాలికలకు ప్రధాని మోదీ శుభవార్త.. ఎర్రకోట నుంచి కీలక ప్రకటన

ప్రధాని మోదీ(ఫైల్ ఫొటో)

ప్రధాని మోదీ(ఫైల్ ఫొటో)

దేశంలోని అన్ని సైనిక్ స్కూళ్లలో బాలిక‌ల‌కు ప్రవేశం కల్పించనున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశంలోని బాలికలకు శుభవార్త చెప్పారు. ఎర్రకోట పై నుంచి ప్రధాని మాట్లాడుతూ.. దేశంలోని అన్ని సైనిక్ పాఠశాలల్లో బాలిక‌ల‌కు ప్రవేశం ఉంటుంద‌ని ప్రధాని వెల్లడించారు. అనేక మంది బాలకలు సైనిక స్కూళ్లలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. ఈ మేరకు తనకు లేఖలు సైతం రాస్తున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి దేశంలోని అన్ని సైనిక్ స్కూళ్లలో బాలికలకు ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించినట్లు ప్రధాని వెల్లడించారు. ప్రస్తుతం దేశ‌వ్యాప్తంగా 33 సైనిక్ స్కూళ్లు ఉన్నాయని ప్రధాని అన్నారు. రెండున్నరేళ్ల క్రితం తొలిసారి మిజోరంలోని సైనిక్ స్కూల్‌లో బాలిక‌ల‌ను అనుమ‌తించిన‌ట్లు మోదీ వివరించారు. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఉన్న బాలికల కోసం వారికి సైనిక్ స్కూళ్లలో అడ్మిషన్లు కల్పించనున్నట్లు తెలిపారు. దేశంలోని 33 సైనిక్ స్కూళ్లను సైనిక్ స్కూల్స్ సొసైటీ నిర్వహిస్తుంది. సైనిక్ స్కూల్ సొసైటీ దేశ రక్షణ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది.

August 15: ఘనంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ప్రధాని మోదీ జెండా వందనం

ఇదిలా ఉంటే..  ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ... ఆజాదీ కా అమృత మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశంకోసం పోరాడి త్యాగాలు చేసిన మహనీయుల కీర్తిని కొనియాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కరోనా సమయంలో కరోనా వారియర్లు ప్రజా సేవ చేస్తున్నారని మెచ్చుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి అండగా ఉన్నాయన్నారు. ఒలింపిక్స్‌లో అద్భుత విజయాలు సాధించిన క్రీడాకారులకు చప్పట్లతో ఘనస్వాగతం పలుకుదామంటూ... స్వయంగా ప్రధానమంత్రి చప్పట్లు కొట్టారు. ప్రతి సంవత్సరం ఆగస్ట్ 14న విభజన భయానక జ్ఞాపకాల దినోత్సవం జరుపుకుందామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... అప్పటి త్యాగాలు, పరిస్థితులను స్మరించారు.

ఈ కరోనా సమయంలో భారత్ స్వయంగా కరోనా వ్యాక్సిన్ తయారుచేయడమే కాక... ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇండియా చేపట్టిందని ప్రధాని గుర్తు చేశారు. 54 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని అన్నారు. మన దేశంలో జనాభా సంఖ్య ఎక్కువన్న మోదీ... ఎన్నో సవాళ్లు ఉన్నాయన్నారు. అయినా సరే ముందుకు వెళ్తున్నామన్నారు. సరికొత్త సంకల్పంతో ముందుకెళ్దామని పిలుపునిచ్చారు మోదీ. నయా భారత్ సృష్టించేందుకు ఇది అమృత కాలం అన్నారు మోదీ. అందరితో, అందరి విశ్వాసంతో, అందరి అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నామన్న మోదీ... అందరూ ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు.

First published:

Tags: Modi, Pm modi, School admissions

ఉత్తమ కథలు