TS TET ఫలితాలు(TS Tet Results) షెడ్యూల్ ప్రకారం నేడు (జూన్ 27) విడుదల కావాల్సింది. కానీ ఈ ఫలితాలు వాయిదా పడ్డాయి. త్వరలోనే ఎప్పుడు విడుదల చేస్తామనే తేదీని ప్రకటిస్తామని టెట్(TET) కన్వీనర్ రాధారెడ్డి పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే..తెలంగాణలో మార్చి 24న టెట్ నోటిఫికేషన్ ను (TS TET-2022 Notification) విద్యాశాఖ విడుదల చేసింది. తెలంగాణ(Telangana) ఏర్పడిన తర్వాత మూడో సారి టెట్ పరీక్షను(TET Exam) ఈ నెల 12 న నిర్వహించారు. ఆ రోజు ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ 1 ఎగ్జామ్ జరగగా.. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 ను నిర్వహించారు. మొదటి సారిగా ఈ సారి బీఈడీ(BEd) చేసిన అభ్యర్థులకు పేపర్ 1 కు కూడా అవకాశం ఇచ్చారు.
దీంతో మునుపు ఎన్నడూ లేని విధంగా పేపర్ 1 కు ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. పేపర్-1 పరీక్షకు 3,18,506 మంది హాజరయ్యారు. దీంతో పాటు.. పేపర్-2కు 2,51,070 మంది అభ్యర్థులు పరీక్షను రాశారు. రెండు పేపర్లకు దాదాపు 90 శాతానికి పైగా అభ్యర్థులు టెట్ పరీక్షకు హాజరయ్యారు. టెట్ ను జీవితకాల అర్హతగా గుర్తించడంతో పోటీ పెరిగింది.
అయితే ఇటీవల విద్యాశాఖ అధికారులు టెట్ ప్రాథమిక కీని(TET Initial Key) విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే వాటిలో ఏమైనా తప్పులు ఉంటే అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశాన్ని ఇచ్చారు. ఇలా కీపై పేపర్-1కు 7,930, పేపర్-2కు 4,663 అభ్యంతరాలు రాగా, వీటిపై చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 27న ఫలితాలు రావాల్సి ఉంది.
వీటి కంటే ముందు ఫైనల్ కీ కూడా మూడు రోజుల ముందుగానే విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇవి రెండు జరగలేదు. జూన్ 27నే ఫైనల్ కీ తో పాటు పరీక్ష ఫలితాలు కూడా వస్తాయని అభ్యర్థులు ఆశించనా అది కుదర్లేదు. మార్కుల క్రోడీకరణ, సాంకేతికంగా తలెత్తిన కొన్ని సమస్యల వల్లే ఫలితాల వెల్లడిని వాయిదా వేసినట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది. అయితే ఫలితాలను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని టెట్ కన్వీనర్ రాధారెడ్డి వెల్లడించారు. ఫలితాలను ఏ తేదీన విడుదల చేస్తామనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని అన్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.