ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు ఉన్నాయంటూ మోసాలు చేస్తున్న బాగోతం బయటపడింది. తమ ఎయిర్‌లైన్స్ పేరుతో ఫేక్ రిక్రూట్మెంట్ చేపట్టినట్టు గుర్తించింది. మొత్తం 120 ఖాళీలు ఉన్నాయని, దరఖాస్తు చేసే అభ్యర్థులు రూ.9,800+జీఎస్టీ చెల్లించాలన్నది ఆ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సారాంశం. సోషల్ మీడియాలో ఈ పోస్టింగ్ చూసిన ఓ వ్యక్తి... నియామకాల గురించి ఎయిర్ ఇండియా ప్రతినిధులను ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. ఇలా తమ సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయని మోసం చేస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా గుర్తించిన ఎయిర్ ఇండియా పోలీసులకు ఫిర్యాదు చేయనుంది.
ఎయిర్ ఇండియాలో నియామకాల గురించి రెండు పేజీల ఫేక్ అడ్వర్టైజ్మెంట్ గుర్తించాం. దరఖాస్తు చేసిన రోహన్ వర్మ అనే వ్యక్తిని రూ.9,800+జీఎస్టీ డిపాజిట్ చేయాలని సదరు మోసగాళ్లు కోరారు. Air India Building, Akola, Santacruz East, Mumbai, Maharashtra 400047 పేరుతో నకిలీ అడ్రస్ అడ్వర్టైజ్మెంట్లో ఉంది. మాకు అకోలాలో ఎలాంటి భవనం లేదు.
— ఎయిర్ ఇండియా ప్రతినిధి
మొత్తం 120 పోస్టుల కోసం 150 మంది అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేసినట్టు ఆ నకిలీ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్లో వివరాలున్నాయి. ఫేక్ రిక్రూట్మెంట్ చేపట్టింది ఎవరో తెలుసుకునేందుకు ఎయిర్ ఇండియా అధికారులు విచారణ మొదలుపెట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు. నిరుద్యోగులు ఎవరైనా ఎయిర్ ఇండియా పేరుతో ఉద్యోగ ప్రకటనలు సోషల్ మీడియాలో కనిపిస్తే ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లోని కెరీర్స్ సెక్షన్లో వెరిఫై చేసుకోవాలి. ఎయిర్ ఇండియా నియామకాలకు సంబంధించిన పూర్తి సమాచారం కంపెనీ అధికారిక వెబ్సైట్లోనే ఉంటుంది.