AICTE SWANATH SCHOLARSHIP 2021 STUDENTS WHO LOST PARENTS DUE TO COVID 19 CAN APPLY SCHOLARSHIP WORTH RS50000 GH SK
Scholarship: రూ. 50 వేల స్టైఫండ్.. ఆ విద్యార్థులకు ఏఐసీటీఈ స్వనాథ్ స్కాలర్షిప్.. పూర్తి వివరాలు
(ప్రతీకాత్మక చిత్రం)
AICTE SWANATH Scholarships: ఉన్నత విద్యనభ్యసించే అనాధ పిల్లలు, కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని లేదా ఇద్దరినీ కోల్పోయిన విద్యార్థులు.. సాయుధ దళాలు, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సుల్లో పనిచేస్తూ అమరులైన జవాన్ల పిల్లలు ఈ స్కాలర్షిప్కు అప్లై చేసుకోవచ్చు.
కరోనా మహమ్మారి (Covid-19 pandemic)కారణంగా వేలాది మంది పిల్లలు నిరాశ్రయులయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారి చదువు, భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అటువంటి పిల్లలకు ఉన్నత విద్యలో చేయూతనిచ్చేందుకు ఆల్ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్.. స్వనాథ్ (AICTE SWANATH) పేరుతో కొత్త స్కాలర్షిప్ను ప్రారంభించింది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఈ స్కాలర్షిప్ను అమలు చేయనున్నట్లు పేర్కొంది. కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారితో పాటు సాయుధ దళాలు, సెంట్రల్ పారామిలిటరీ దళాల్లో విధినిర్వహణలో అమరులైన జవాన్ల పిల్లలకు ఈ స్కాలర్షిప్ అందజేస్తామని ఏఐసీటీఈ ప్రకటించింది.
స్వనాథ్ కింద ఏటా మొత్తం 2000 స్కాలర్షిప్లను అందించనుంది. ఇందులో డిగ్రీ విద్యార్థులకు 1000, డిప్లొమా విద్యార్థులకు 1000 స్కాలర్షిప్లు ఉన్నాయి. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో డిగ్రీ లేదా డిప్లొమా రెగ్యులర్ కోర్సులు చేస్తున్న వారు ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పేర్కొంది. ఎంపికైన విద్యార్థులకు ఏటా రూ. 50,000 స్కాలర్షిప్ ఇస్తామని తెలిపింది.
డిగ్రీ లేదా ఇంజినీరింగ్ విద్యార్థులకు గరిష్టంగా నాలుగేళ్లు, డిప్లొమా విద్యార్థులకు గరిష్టంగా మూడేళ్ల పాటు స్కాలర్షిప్ అందిస్తారు. కళాశాల ఫీజు చెల్లింపు, కంప్యూటర్ కొనుగోలు, స్టేషనరీలు, పుస్తకాలు, ఇతర పరికరాలను కొనుగోలు కోసం అయ్యే ఖర్చుల కోసం ఈ స్కాలర్షిప్ను మంజూరు చేస్తున్నట్లు ఏఐసీటీఈ తెలిపింది. కాగా, అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థి ఎంపిక ఉంటుంది. ఈ స్కాలర్షిప్ను ప్రతి ఏటా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత గల విద్యార్థులు 2021 నవంబర్ 30లోపు ఏఐసీటీఈ అధికారిక వెబ్సైట్ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
* స్వనాథ్ స్కాలర్షిప్కు అర్హులెవరు?
ఉన్నత విద్యనభ్యసించే అనాధ పిల్లలు, కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని లేదా ఇద్దరినీ కోల్పోయిన విద్యార్థులు.. సాయుధ దళాలు, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సుల్లో పనిచేస్తూ అమరులైన జవాన్ల పిల్లలు ఈ స్కాలర్షిప్కు అప్లై చేసుకోవచ్చు. ఈ విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ .8 లక్షలకు మించకూడదు. విద్యార్థులు ఏ ఇతర స్కాలర్షిప్లను పొందకూడదు. అలాంటి వారికే ఈ స్కాలర్షిప్ను మంజూరు చేస్తారు.
* కావాల్సిన డాక్యుమెంట్స్..
విద్యార్థులు తండ్రి, తల్లి మరణ ధ్రువీకరణ పత్రం, తహసీల్దార్ జారీ చేసిన అనాథ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాలి. ప్రస్తుతం చదువుతున్న విద్యా సంస్థ జారీ చేసిన బోనఫైడ్ సర్టిఫికేట్, డిగ్రీలో స్కాలర్షిప్కి ఇంటర్మీడియట్ మార్కు షీట్, డిప్లామా స్కాలర్షిప్కు 10 వ తరగతి మార్క్ షీట్, కేటగిరీ సర్టిఫికేట్ అవసరమవుతాయి. తండ్రి లేదా తల్లి లేదా ఇద్దరి మరణ ధ్రువీకరణ పత్రంలో.. కోవిడ్ -19 కారణంగానే వారు మరణించినట్లు ధ్రువీకరించాలి. సాయుధ దళాలు లేదా కేంద్ర పారామిలిటరీ దళాలు జారీ చేసిన షహీద్ సర్టిఫికేట్ సైతం అందించాలి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.