AICTE : విద్యార్థులను ప్రోత్సహించేందుకు అనేక రకాల స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రతిభను గుర్తిస్తూ.. ఆర్థిక సహకారం అందిస్తూ.. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు వీటిని అందజేస్తున్నాయి. తాజాగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) స్కాలర్‌షిప్ పథకం 2022-23 కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ గడువును పొడిగించింది. జనవరి 20వ తేదీ వరకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు AICTE అధికారిక వెబ్‌సైట్ aicte-india.org ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నెలకు స్కాలర్‌షిప్ రూ.12,400
AICTE PG స్కాలర్‌షిప్ పథకం కింద, AICTE- అప్రూవ్ చేసిన ఇన్‌స్టిట్యూట్స్ నుంచి మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్, మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మాస్టర్ ఆఫ్ ఫార్మసీ, మాస్టర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్‌లను అభ్యసించే అభ్యర్థులు PG స్కాలర్‌షిప్‌గా నెలకు రూ. 12,400 పొందుతారు. ఎంపికైన అభ్యర్థులు వారి అకడమిక్ పనితీరు, AICTE PG స్కాలర్‌షిప్ నియమాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండటం ఆధారంగా ప్రతి నెలా స్కాలర్‌షిప్ మొత్తాలను అందజేస్తారు.
మొత్తం ప్రక్రియకు జనవరి 31 వరకు అవకాశం
AICTE PG స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ గతంలో 2022 నవంబర్ 30గా నిర్ణయించారు. ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా వెరిఫికేషన్‌కు చివరి తేదీ డిసెంబర్ 15. అయితే సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా విద్యార్థుల ధృవీకరణ కోసం కౌన్సిల్ చివరి తేదీని కూడా పొడిగించింది. ఇక, దరఖాస్తుల్లో తప్పలను సరిచేసి, మొత్తం ప్రక్రియను పూర్తి చేయడానికి AICTE జనవరి 31 వరకు అవకాశం కల్పించింది.
అధికారిక నోటిఫికేషన్ ఇలా
AICTE విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్‌లో.. ‘పీజీ స్కాలర్‌షిప్ స్కీమ్ గైడ్‌లైన్స్ AICTE వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. AICTE- ఆమోదించిన ఇన్‌స్టిట్యూట్‌లలో అప్రూవ్డ్ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు, స్కీమ్ మార్గదర్శకాల ప్రకారం, పోర్టల్‌లో తమ దరఖాస్తును సమర్పించవచ్చు.’ అని తెలిపింది.
గడువులోగా సమర్పించాలి
విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సకాలంలో సమర్పించాలని కౌన్సిల్ సూచించింది. దీంతో సంబంధింత ఇన్‌స్టిట్యూట్స్ నిర్ణీత గడువులోపు దరఖాస్తులను ధృవీకరించడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. చివరి తేదీ తర్వాత వచ్చిన అన్ని దరఖాస్తులను స్వీకరించబోమని AICTE స్పష్టం చేసింది. ఆన్‌లైన్ పోర్టల్‌లో దరఖాస్తులను స్వీకరించిన వెంటనే తమ విద్యార్థుల దరఖాస్తులను ధృవీకరించాలని అర్హత పొందిన ఇన్‌స్టిట్యూట్‌లకు ఏఐసీటీఈ ఆదేశాలు జారీ చేసింది.
తప్పనిసరి డాక్యుమెంట్లు
AICTE PG స్కాలర్‌షిప్ కోసం ఆధార్ తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ లేని ఏ దరఖాస్తును అప్రూవ్ చేయరు. స్కాలర్‌షిప్‌ల కోసం అవసరమైన తప్పనిసరి ఇతర డాక్యుమెంట్లలో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్), గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (GPAT) లేదా కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ (CEED)కు సంబంధించిన వ్యాలిడ్ స్కోర్‌లు అడ్మిషన్ సమయంలో అవసరం ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aicte, Career and Courses, Scholarship