కొత్తగా ప్రారంభించిన అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్(Agnipath Recruitment) పథకం ద్వారా భారత సాయుధ దళాలలో చేరిన అగ్నివీరు (Agniveer)లను శాశ్వత సైనికులుగా ఎంపిక చేయనున్న విషయం తెలిసిందే. అయితే తుది మెరిట్ జాబితాను రూపొందించడానికి ముందు అగ్నివీరులను అన్ని రకాలుగా పరిశీలిస్తామని ఆర్మీ (Army) స్టాఫ్ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ బిఎస్ రాజు న్యూస్ 18కి తెలిపారు. మల్టిపుల్ ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ పారామీటర్స్‌పై నాలుగు సంవత్సరాల పాటు వారిని పరీక్షిస్తామని చెప్పారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 25 శాతం అగ్నివీరుల ఎంపిక ప్రక్రియపై ఉన్న భయాలను తొలగించడానికి ప్రయత్నించారు. నాలుగేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత, అగ్నివీరులకు తాము పారదర్శకమైన ప్రక్రియను పూర్తి చేశామనే భావన కలగాలని, ఆర్మ్స్, సర్వీసెస్‌లో రిక్రూట్ చేయడానికి నిర్దిష్టమైన నిబంధనలను సిద్ధం చేశామని బిఎస్ రాజు చెప్పారు.
అగ్నివీర్‌లకు శాశ్వత ఉద్యోగాలు కల్పించడంలో నిష్పక్షపాతంగా ఎంపిక ప్రక్రియను సైన్యం నిర్వహిస్తుందనడానికి నిర్దారణ ఏంటని అడిగిన ప్రశ్నకు ఆయన వివరణ ఇచ్చారు. అగ్నివీరులు తమ మొదటి ఆరు నెలల శిక్షణా కాలం ముగిసిన తర్వాత మొదటి అసెస్‌మెంట్(Assessment) టెస్ట్‌ను ఎదుర్కొంటారని లెఫ్టినెంట్ జనరల్ రాజు చెప్పారు. తర్వాత ప్రతి సంవత్సరం చివరిలో, శారీరక దృఢత్వం, ఫైరింగ్ నైపుణ్యాలు, ఇతర కసరత్తులు వంటి వివిధ పారామీటర్స్ ఆధారంగా అగ్నివీరులను అంచనా వేస్తామన్నారు. ఆట్టిట్యూడ్, ఆప్టిట్యూడ్‌ను పరిశీలిస్తామని, ప్లాటూన్ కమాండర్, కంపెనీ కమాండర్, కమాండింగ్ ఆఫీసర్ వంటి వ్యక్తులతో అగ్నివీరులు నడుచుకునే తీరును, సంభాషించే వైఖరిని కూడా గమనిస్తామని చెప్పారు.
ఆయా సందర్భాల్లో నిర్వహించిన అసెస్‌మెంట్ టెస్ట్‌ల వివరాలన్నీ ఒకచోట చేరుస్తామని, సంవత్సరం చివరిలో, అన్నింటినీ కలిపి సిస్టమ్‌లోకి అప్‌లోడ్ చేస్తామని వివరించారు. ఆ తర్వాత ఎవరూ వాటిని మార్చే వీలుండదని, రెండో, మూడో సంవత్సరం చివరిలో కూడా ఇదే విధానాన్ని అనుసరించి నాలుగేళ్లు పూర్తయ్యాక మొత్తం డేటాను ఒకచోట చేర్చి మెరిట్ జాబితాను రూపొందిస్తామని స్పష్టం చేశారు. అత్యుత్తమ సైనికులను ఎంపిక చేస్తున్నామనే విశ్వాసాన్ని ఈ ప్రక్రియ కలిగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శిక్షణ కాలం అంతా అగ్నివీర్‌కు కౌన్సెలింగ్ ఇస్తామని, ఎప్పటికప్పుడు పనితీరును మెరుగుపరచుకునేందుకు పర్ఫార్మెన్స్ అప్రైజల్స్ ఇస్తామని చెప్పారు.
మహిళా సైనికులను అగ్నివీరులుగా అవకాశం కల్పించడంపై అడిగిన ప్రశ్నకు.. అగ్నిపథ్ పథకం ద్వారా కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్ (CMP)లో మహిళా రిక్రూట్‌మెంట్లు జరుగుతాయని చెప్పారు. ఇతర నియామకాల మాదిరిగానే, CMPకి మహిళల నియామకం ప్రారంభ బ్యాచ్‌ల తర్వాత రెండేళ్లపాటు ఆగిపోయిందన్నారు.
శిక్షణకు నాలుగు సంవత్సరాలు సరిపోతుందా?
సైనికులుగా శిక్షణ గురించి లెఫ్టినెంట్ జనరల్ రాజు మాట్లాడుతూ.. వారి శిక్షణకు నాలుగేళ్లు అంటే చాలా సమయం అందుబాటులో ఉన్నట్లని చెప్పారు. వారికి ఆరు నెలల పాటు తీవ్రమైన శిక్షణ ఇస్తారని, అవసరాల ఆధారంగా బెటాలియన్ కమాండర్ ప్రతి ఒక్కరికీ విభిన్న నైపుణ్యాలను పెంపొందించేందుకు అవసరమైన శిక్షణను అందిస్తారని అన్నారు.
ప్రతి ఒక్కరికి తగినంత శిక్షణ ఇస్తామని, బెటాలియన్ కార్యాచరణ అవసరాలు తీర్చే స్థాయిలో ఉంటారని, వారితోనే తర్వాత యుద్ధానికి వెళ్లవచ్చని, ఆ స్థాయిలో సిద్దం చేస్తామని చెప్పారు. ఇన్‌స్ట్రక్టర్ వంటి పోస్టులను కోరుకునే అగ్నివీరులు, నాలుగేళ్ల తర్వాత మరింత నైపుణ్యాన్ని పెంచుకునేందుకు అధునాతన కోర్సులు చేయవచ్చని తెలిపారు. అప్ స్కిల్లింగ్ నాలుగు సంవత్సరాలలో జరుగుతుందని, ఇన్‌స్ట్రక్టర్‌గా మారడానికి నాలుగు సంవత్సరాల తర్వాత ప్రత్యేక శిక్షణ ఇస్తామని వివరించారు.
నియంత్రిత పద్ధతిలో ప్రాజెక్ట్
‘అగ్నిపథ్ ప్రాజెక్ట్ చాలా నియంత్రణలో ఉంది, అందుకే దీనిని పైలట్ ప్రాజెక్ట్‌గా పరిగణించవచ్చు. దీనిని బాగా అంచనా వేయడానికి, అవసరమైతే మార్పులు చేయడానికి ఇది మాకు సమయాన్ని ఇస్తుంది. తక్షణమే మార్పు అవసరం లేదు. స్కీమ్‌లో ఏదైనా తదుపరి మార్పును చేసేందుకు రక్షణ మంత్రికి అధికారం ఉంది’ అని లెఫ్టినెంట్ జనరల్ రాజు చెప్పారు.
ఖర్చుపై..
ఈ పథకం ప్రకటనపై ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ, ఎప్పటిలాగే సాయుధ దళాలలో చేరడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారనడంలో సందేహం లేదని VCOAS తెలిపింది. దీనికి సానుకూల స్పందన ఉంటుందని లెఫ్టినెంట్ జనరల్ రాజు చెప్పారు. ఆర్మీ శిక్షణ సామర్థ్యం రిక్రూట్ చేసిన సంఖ్య కంటే ఎక్కువగా ఉండటంతో పథకం కింద తక్షణ ఆదాయ వ్యయాలు ఉండవని ఆయన అన్నారు. 6వ లేదా 7వ సంవత్సరం తర్వాత శిక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉండవచ్చని, అప్పటి పరిస్థితిని అంచనా వేసే ఆధారంగా మౌలిక సదుపాయాలను పెంచవచ్చని చెప్పారు.
మానవశక్తిని తగ్గించడం
ఈ పథకం ద్వారా మానవ వనరుల కొరతను ఆర్మీ భర్తీ చేస్తుందని లెఫ్టినెంట్ జనరల్ రాజు తెలిపారు. గత రెండేళ్లలో రిక్రూట్‌మెంట్ జరగలేదని, ఇప్పుడు నిష్క్రమణ విధానంతో నిర్దిష్ట సంఖ్యలో రిక్రూట్‌లను రిక్రూట్ చేస్తున్నామని చెప్పారు. సైన్యం బలం కావలసిన స్థాయిలో అందేలా రిక్రూట్‌మెంట్ ఉంటుందని పేర్కొన్నారు.
అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్‌పై..
డిప్లొమాతో ఫోర్స్‌లో చేరే వారికి, ప్రోగ్రామ్ సమయంలో వారు పొందిన అదనపు నైపుణ్య అర్హతలు వారిని డిగ్రీ కోర్సుకు అర్హులుగా మారుస్తాయని సీనియర్ ఆర్మీ అధికారి తెలిపారు. మిలిటరీలో ఉన్న సమయంలో అగ్నివీరులకు క్రెడిట్ పాయింట్లను కేటాయిస్తారని, తక్కువ సంవత్సరాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికి వాటిని రిడీమ్ చేసుకోవచ్చని ఆయన అన్నారు.
పర్మినెంట్ ఉద్యోగం, పెన్షన్ హామీ లేకుండా భారతీయ గ్రామీణ యువకులను సైన్యంలో చేరమని ఎలా ఒప్పిస్తారని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. నాలుగు సంవత్సరాల పాటు సాయుధ దళాలలో చేరడానికి యువతకు అవకాశం కల్పించే విధంగా ఈ పథకం రూపొందించామని, ఈ కాలంలో వారికి ఆర్థికంగా పరిహారం అందుతుందని, వారి పదవీకాలం ముగిసే సమయానికి సేవా నిధి ప్యాకేజీ పొందుతారని తెలిపారు. ఆ తర్వాత అనేక కెరీర్ మార్గాలను ఎంచుకునే అవకాశం ఉందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agnipath Scheme, Army jobs, Career and Courses, JOBS