ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) సంచలన నిర్ణయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ట్విట్టర్‌ను (Twitter) హస్తగతం చేసుకున్న తర్వాత అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. పనితనం సరిగ్గా లేని ఉద్యోగులను లే ఆఫ్స్ (Layoffs) పేరుతో ఇంటికి సాగనంపడమే పనిగా పెట్టుకున్నాడు. దీంతో ఉద్యోగుల నుంచి భారీ నిరసన ఎదురైంది. కొంతమంది ఉద్యోగులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్దపడ్డారు. దీంతో మొదటికే మోసం వస్తుందని గ్రహించిన మస్క్.. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను విరమించుకున్నాడు. ఇక మీదట తాను ఉద్యోగులను తొలగించబోనంటూ ఎలాన్ మస్క్ ప్రకటించాడు. మస్క్ తాజా ప్రకటన వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నవారికి ప్రాధాన్యం
ఉద్యోగుల తొలగింపు ఉండదని, కొత్తగా ఇంజినీర్లు, సేల్స్ విభాగంలో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు మస్క్ చెప్పాడు. సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ కోడ్‌ను గొప్పగా రాసే వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని తెలిపాడు. రిఫరల్స్ ఉంటే చెప్పాలని మస్క్ ట్విట్టర్ ఉద్యోగులను కోరినట్లు సమాచారం. ఉద్యోగులతో ఇటీవల జరిగిన సమావేశంలో మస్క్ మాట్లాడుతూ .. టెక్నాలజీ స్టాక్‌లోని కీలకమైన విభాగాలను మొదటి నుంచి పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఇంజనీరింగ్ బృందాలను ఒక్కతాటిపైకి తెచ్చి వికేంద్రీకరణ చేసే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నాడు.
Google Layoffs: మరో షాక్... 10,000 మంది ఉద్యోగుల్ని తొలగించే ఆలోచనలో గూగుల్
వాస్తవానికి మస్క్ ట్విట్టర్లో ఏకైక బోర్డు సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు మొత్తం ఉద్యోగుల సంఖ్య 7000 వరకు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 2700కు తగ్గింది. అంటే మస్క్ దాదాపు 2/3 ఉద్యోగులను తొలగించినట్లు స్పష్టమవుతోంది. ట్విట్టర్ CEO పరాగ్ అగర్వాల్‌ను కూడా మస్క్ తొలగించాడు. ఆ తరువాత దాదాపు 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాడు. ఈ వారం సేల్స్ టీమ్‌లో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. అనేక రౌండ్ల తొలగింపుల తర్వాత మస్క్ మాట్లాడుతూ.. ఇకపై ఉద్యోగుల తొలగింపు ఉండదని ప్రకటించాడు.
భారతీయ టెక్ ఉద్యోగులకు అవకాశం
ట్విట్టర్‌కు చెందిన జపాన్, ఇండియా, ఇండోనేషియా, బ్రెజిల్ దేశాల్లోని కార్యాలయాల్లో మస్క్ దాదాపు 90 శాతం మంది ఉద్యోగులను తగ్గించారు. కొన్ని కార్యాలయాల్లో గతంలో 200 మంది ఉద్యోగులు ఉండగా.. ఇప్పుడు కేవలం 20 మంది మాత్రమే మిగిలి ఉన్నారని తెలుస్తోంది. భారతదేశం నుంచి పని చేస్తున్న మొత్తం కమ్యూనికేషన్స్, మార్కెటింగ్, పార్టనర్ రిలేషన్స్ టీమ్‌లను తొలగించినట్లు సమాచారం. భారతదేశంలోని దాదాపు 70 శాతం మంది ఇంజనీరింగ్ సిబ్బందిని తొలగించినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది.
ట్విట్టర్2.0 నిర్మాణానికి అనుగుణంగా పనిచేయాలి
అయితే మస్క్ Twitter 2.0ని నిర్మించడంలో భాగంగా భారతదేశానికి చెందిన ఇంజనీర్లను భారీగా నియమించుకోవాలని చూస్తున్నప్పటికీ, కంపెనీ ఏ రకమైన ఇంజనీరింగ్ లేదా సేల్స్ విభాగాల్లో నియమకాలు జరుగుతాయనేది స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతానికి ట్విట్టర్ కెరీర్ పేజీలో ఎటువంటి రిక్రూట్మెంట్ అప్డేట్ కనిపించడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.