రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Parliament Budget Sessions) వాడివేడిగా జరుగుతున్నాయి. ఒకవైపు వాయిదాల పర్వం కొనసాగుతుండగా, మరోవైపు వివిధ రంగాల పురోగతి గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. తాజాగా దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు ఇతర హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల ఖాళీలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. సెంట్రల్ యూనివర్సిటీల్లో 6,180 ఫ్యాకల్టీ పోస్టులు, ఐఐటీల్లో 4526 పోస్టులు, ఐఐఎంల్లో 496 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రమంత్రి పార్లమెంట్‌కు తెలిపారు.
కేంద్ర విద్యాశాఖ డేటా ప్రకారం..దేశవ్యాప్తంగా ఉన్న 45 సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి విభాగాల్లో మొత్తం 18,956 పోస్టులు మంజూరు కాగా, ప్రస్తుతం 6,180 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐఎంల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల్లో కేటగిరీ వారిగా ఎస్సీలకు 961, ఎస్టీలకు 578, ఓబీసీలకు 1,657, ఈడబ్ల్యూఎస్‌కు 643, పీడబ్ల్యూడీ కేటగిరీకి 301 పోస్టులను రిజర్వ్ చేశారు.
ప్రస్తుతం 7 ఐఐటీలు, 22 ఎన్‌టీలు, 20 ట్రిపుల్‌ఐటీల్లో చైర్‌పర్సన్, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (BoGs) నియామకాలు జరగలేదు. ఈ ఏడు ఐఐటీల్లో ఇంఛార్జ్ బాధ్యతలను ఇతర ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన చైర్‌పర్సన్స్, బీఓజీలకు కేటాయించారు. ఎన్‌ఐటీల్లో కొత్త ఛైర్‌పర్సన్, బీఓజీని నియమించే వరకు వారి బాధ్యతలను ఎన్‌ఐటీ డైరెక్టర్ నిర్వర్తిస్తారు. ట్రిపుల్‌ఐటీల విషయంలో సెంట్రల్ ఫండ్స్‌తో పనిచేసే ఇతర టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్‌కు చెందిన ఛైర్ పర్సన్, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌కు ఇంఛార్జి బాధ్యతలను అప్పగిస్తారు. లేదా ప్రస్తుతం ఉన్న వారి పదవికాలాన్ని మరింత పొడిగించవచ్చు. లేకపోతే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులకు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించే అకాశం ఉంది.
ఇది కూడా చదవండి : స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల కోసం ఓపెన్ లెర్నింగ్ పోర్టల్.. IIM అహ్మదాబాద్ ప్రకటన
* మిషన్ మోడ్‌లో భాగంగా
మిషన్ మోడ్(Mission Mode)లో భాగంగా ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలని అన్ని సెంట్రల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూట్‌లను ఆదేశించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఇప్పటివరకు మిషన్ మోడ్‌లో భాగంగా ఆరు వేలకు పైగా ఫ్యాకల్టీ/నాన్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
‘హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూట్‌లలో ఖాళీలు ఏర్పడటం, వాటిని భర్తీ చేయడమనేది నిరంతర ప్రక్రియ. సెంట్రల్ యూనివర్సిటీలు స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థలు. సంబంధిత కేంద్ర చట్టాల ప్రకారం అవి ఏర్పాటు అయ్యాయి. వాటిలో వివిధ పోస్టుల నియామక ప్రక్రియ అనేది వాటి చట్టాలు, నియమాలు, UGC మార్గదర్శకాలకు అనుగుణంగా జరుగుతాయి.’ అని కేంద్ర మంత్రి ప్రదాన్ వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Central university, EDUCATION, IIT, JOBS