ప్రస్తుత ఎమర్జింగ్ ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా స్కిల్స్ పెంపొందించుకోవడం పై యువత ఆసక్తి చూపుతోంది. అందుకు తగ్గట్టు వివిధ రంగాల సబ్జెక్ట్‌లను ఎంచుకోవడానికి వీలు కల్పించే మల్టీ డిసిప్లినరీ డిగ్రీ కోర్సులను 94 శాతం మంది విద్యార్థులు చేయాలనుకుంటున్నారని ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ టీమ్‌లీజ్ వెల్లడించింది. ఇటీవల ఈ సంస్థ చేపట్టిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 90% కంటే ఎక్కువ మంది విద్యార్థులు తమ ఎడ్యుకేషన్‌లో ఫిజికల్ క్లాస్‌రూమ్/వర్చువల్ క్లాస్‌రూమ్ లెర్నింగ్ ఎలిమెంట్ కొంత, జాబ్ లెర్నింగ్ ఎలిమెంట్, ప్రాజెక్ట్ వర్క్‌కు సంబంధించిన ఎలిమెంట్ కుడా ఉండాలని కోరుకుంటున్నట్లు సర్వే పేర్కొంది.
10,000 మంది గ్రాడ్యుయేట్స్ పరిశీలన
టీమ్‌లీజ్ సంస్థ సర్వేను పాన్-ఇండియా లెవల్లో చేపట్టింది. సర్వేలో భాగంగా 18-25 సంవత్సరాల వయసు ఉన్న 10,000 మంది పైగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్యార్థుల అభిప్రాయాలను తీసుకుంది. తదనుగుణంగా సమగ్ర డేటా అనాలసిస్, డేటా ప్రిపరేషన్ చేసి ఓ రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది.
జాబ్ లెర్నింగ్- ప్రాజెక్ట్ వర్క్ ఎలిమెంట్
70% కంటే ఎక్కువ మంది విద్యార్థులు హైబ్రిడ్ లెర్నింగ్ ద్వారా ప్రయోజనం ఉంటుందని నమ్ముతున్నారు. క్యాంపస్, ఆన్‌లైన్ బోధనతో మిలితమైన ఈ విధానం ద్వారా త్వరగా ఉద్యోగవకాశాలు పొందవచ్చని విద్యార్థులు విశ్వసిస్తున్నారు. 90 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు వర్క్-ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పట్ల మొగ్గు చుపుతున్నారు. కేవలం తరగతి బోధన మాత్రమే కాకుండా జాబ్ లెర్నింగ్ ఎలిమెంట్, ప్రాజెక్ట్ వర్క్ ఎలిమెంట్ కూడా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక, 70శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు హైబ్రిడ్ మోడ్‌లో డిగ్రీ చేయాలనుకుంటున్నారని సర్వే పేర్కొంది.
కరోనాతో ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మార్పులు
టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ వ్యవస్థాపకుడు, సీఈవో శంతన్ రూజ్ మాట్లాడుతూ.. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా లెర్నింగ్, ఎడ్యుకేషన్ విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. ప్రస్తుతం మారుతున్న బోధనా విధానాలను గుర్తించడం, అమలులో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి అర్ధవంతమైన చర్యలు తీసుకోవడం భారత్ వంటి దేశాలకు చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
విద్యార్థుల అనుకూలతలను పరిగణనలోకి తీసుకుని విస్తృతమైన, వివరణాత్మకంగా ఈ సర్వే చేపట్టామని తెలిపారు. ఈ సర్వే అనేక కొత్త ట్రెండ్స్, ఆసక్తికరమైన డేటా పాయింట్‌లను కనుగొనడంలో కీలకంగా మారుతుందన్నారు. మొత్తం మీద, ఈ సర్వే 21వ శతాబ్దపు లెర్నర్స్ కోసం హయర్ ఎడ్యుకేషన్ ఫ్రేమ్‌వర్క్‌లను రూపొందించడంలో ఎడ్యుకేటర్స్‌కు ఎంతో ఉపయోగపడుతుందని శంతన్ రూజ్ చెప్పుకొచ్చారు.
ఆ రెండిటి మధ్య అంతరం తగ్గాలి
క్లాస్ రూమ్‌లో ట్రెడిషనల్ టీచింగ్ మెథడాలజీస్, ఇండస్ట్రీ నాలెడ్జ్ అప్లికేషన్ మధ్య అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని విద్యార్థులు నొక్కి చెప్పారు. ట్రెడిషనల్ అకడమిషియన్స్, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌తో కూడిన ఫ్యాకల్టీ ప్యానెల్ ద్వారా బోధన ఉండాలని 83 శాతం మంది విద్యార్థులు అభిప్రాయపడ్డారు. క్వాలిఫైడ్, స్కిల్డ్, రెప్యూటెడ్ ఫ్యాకల్టీ ఆన్‌లైన్‌లో డిగ్రీ కోర్సులను బోధిస్తే ఫీజు చెల్లించడానికి దాదాపు 55.53శాతం మంది విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని సర్వే పేర్కొంది. అయితే ఆన్‌లైన్ కోర్సుల డెలివరీ ఖర్చు తక్కువగా ఉన్నందున, ఆన్-క్యాంపస్ ఫీజు కంటే, ఆన్‌లైన్ కోర్సుల ఫీజు కనీసం 30% తక్కువగా ఉండాలని 60 శాతం పైగా విద్యార్థులు కోరుకుంటున్నట్లు సర్వే పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Students