హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Army Officer: 62 ఏళ్ల వయసులో కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్..ఎందుకంటే?

Army Officer: 62 ఏళ్ల వయసులో కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్..ఎందుకంటే?

రిటైర్డ్ మేజర్ పరమశివం (Image:ANI)

రిటైర్డ్ మేజర్ పరమశివం (Image:ANI)

కుటుంబ పరిస్థితుల కారణంగా సాంకేతిక విద్యను అభ్యసించలేకపోయిన ఆయన.. 62 ఏళ్ల వయసులో ఆ కలను నెరవేర్చుకుంటున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం పాలిటెక్నిక్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు

కొంతమందికి చిన్నప్పటి నుంచి లక్ష్యాలను ఏర్పరచుకునే లక్షణం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు నిరంతరం కృషి చేస్తూ, విజయం సాధించిన ఎంతోమందిని మనం చూశాం. అయితే తన లక్ష్యం కోసం లేటు వయసులో సాంకేతిక విద్యను అభ్యసించేందుకు సిద్ధమయ్యారు పుదుచ్చేరికి చెందిన ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. కుటుంబ పరిస్థితుల కారణంగా సాంకేతిక విద్యను అభ్యసించలేకపోయిన ఆయన.. 62 ఏళ్ల వయసులో ఆ కలను నెరవేర్చుకుంటున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం పాలిటెక్నిక్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు రిటైర్డ్ ఆర్మీ సుబేదార్ మేజర్ కే.పరమశివం. దీంతో ఈయన సంకల్పానికి నేటి యువత సైతం ఫిదా అవుతున్నారు.

62 ఏళ్ల మాజీ సైనికుడు పరమశివం.. సాంకేతిక విద్యను అభ్యసించడానికి తాజాగా పుదుచ్చేరిలోని మోతిలాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చేరారు. చిన్నప్పటి నుంచే ఆయన టెక్నికల్ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్నారు. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ లక్ష్యం నెరవేరలేదు. దీంతో లేటుగా అయినా సరే.. తన కల నెరవేర్చుకుంటున్నానని చెబుతున్నారు పరమశివం.

ఈ విషయంపై ఆయనతో మాట్లాడింది ANI వార్తాసంస్థ. పరమశివం మాట్లాడుతూ.. ‘కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా నేను చదువు కొనసాగించలేకపోయాను. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత ఆర్మీలో చేరాను. 30 సంవత్సరాల సర్వీసు తర్వాత ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాను. ఆ తరువాత నా దృష్టి చదువుల వైపు మళ్లింది. దీంతో క్రమంగా మళ్లీ చదువుకోవడం ప్రారంభించాను. ఇప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం పాలిటెక్నిక్ కాలేజీలో చేరాను’ అని వివరించారు.

తాను చాలా సంవత్సరాలుగా పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తున్నానని, కానీ గతంలో అడ్మిషన్ ఇవ్వలేదని మేజర్ పరమశివం చెబుతున్నారు. ఈ సంవత్సరం కాలేజీ యాజమాన్యంతో పట్టుబట్టి మరీ ప్రవేశం పొందినట్లు చెప్పారు. ‘ఇక్కడ అడ్మిషన్ కోసం గతంలో కూడా ప్రిన్సిపాల్‌తో మాట్లాడాను. అయితే రెండేళ్ల క్రితం అడ్మిషన్ దొరకలేదు. నేను ఈ సంవత్సరం మళ్లీ దరఖాస్తు చేసుకున్నాను. తరువాత నాకు అడ్మిషన్‌ ఇచ్చారు’ అని ఆయన వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

ఇంటి నుంచే MITలో ఆన్‌లైన్ కోర్సులు చేయండి

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ జాబ్‌లు

First published:

Tags: EDUCATION, Indian Army, Puducherry, Study

ఉత్తమ కథలు