ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత, ప్లాట్‌ఫామ్ మొత్తాన్ని మార్చడంపై దృష్టి పెట్టారు ఎలాన్ మస్క్. కంపెనీ ఉద్యోగుల్లో సగం మందిని ఒకేసారి తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు టెక్ కంపెనీల్లో(Tech Company) ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపుతున్నారు. వాస్తవానికి ట్విట్టర్‌తో పాటు మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఇతర కంపెనీలు కూడా ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి. కన్స్యూమర్ కాస్ట్ పెరగడం, అధిక వడ్డీ రేట్లు, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి వంటి కారణాలతో టెక్ కంపెనీలు నియామకాలకు బ్రేక్‌లు వేశాయి. Crunchbase News రిపోర్ట్ ప్రకారం, అక్టోబర్ చివరి నాటికి US టెక్ సెక్టార్‌లో 45,000 కంటే ఎక్కువ మందిని కంపెనీలు తొలగించాయి. ఈ లిస్ట్‌లో ఉన్న సంస్థలు ఏవో చూద్దాం.
* ఇంటెల్
ఈ చిప్ మేకర్ కంపెనీ వచ్చే ఏడాది ఈ కంపెనీ $3 బిలియన్లను ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా కొత్త నియామకాలను తగ్గించడంతో పాటు ఉన్న ఉద్యోగుల్లో కొందరిని తొలగించాలని నిర్ణయించింది. కన్య్సూమర్ చిప్స్‌కు డిమాండ్ తగ్గడం, CHIPS చట్టం ప్రభావం కారణంగా కంపెనీ 20 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది.
* ట్విట్టర్
ఎలాన్ మస్క్ చేతుల్లోకి ట్విట్టర్ వెళ్లిన కొన్ని రోజులకే, వర్క్ ఫోర్స్‌లో దాదాపు సగం మంది ఉద్యోగులను తొలగించారు. కంపెనీ ఆదాయంలో భారీ తగ్గుదలను కంట్రోల్ చేయడానికి ఈ చర్యలు తీసుకోక తప్పట్లేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కంపెనీ రోజుకు $4M కంటే ఎక్కువ నష్టపోతున్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదని మస్క్ తెలిపారు. అయితే లేఆఫ్స్ ఇచ్చిన వారికి మూడు నెలల జీతం పరిహారంగా అందించారు.
* మైక్రోసాఫ్ట్
పీసీల విండోస్ లైనెన్స్‌కు డిమాండ్ తగ్గడంతో, ఈ ఏడాది కంపెనీ రెవెన్యూ పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి గత నెలలో ప్రకటించారు. ఈ క్రమంలో ఎడిషనల్ వర్క్ ఫోర్స్‌ను పక్కన పెడుతున్నట్లు చెప్పారు. జులైలో 1% కంటే తక్కువ మంది ఉద్యోగులను తొలగించినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించిన తర్వాత, మరోసారి కంపెనీ ఈ ప్రకటన చేసింది.
* నెట్‌ఫ్లిక్స్
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ ఏడాది కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంది. దీంతో రెండు రౌండ్లలో దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించింది.
* కాయిన్‌బేస్
US బేస్డ్ కాయిన్‌బేస్ కంపెనీ తమ మొత్తం సిబ్బందిలో 18% మందిని అంటే దాదాపు 1,100 మంది ఎంప్లాయిస్‌ను తొలగించింది. మాంద్యం, క్రిప్టో వింటర్, మార్కెట్ తిరోగమనం ఇందుకు కారణాలని కాయిన్‌బేస్‌లో సహ వ్యవస్థాపకుడు, CEO బ్రియాన్ ఆర్మ్‌స్ట్రాంగ్ తెలిపారు.
* సీగేట్
హార్డ్ డ్రైవ్ తయారీ కంపెనీ సీగేట్ టెక్నాలజీ గత నెలలో గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో ఎనిమిది శాతం, అంటే దాదాపు 3,000 మంది ఉద్యోగులను తగ్గించాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల ప్రకారం, దీర్ఘకాలిక లాభదాయకతను పెంచడానికి ఈ చర్యలు తీసుకున్నామని కంపెనీ
CEO డేవ్ మోస్లీ చెప్పారు.
* ఈ కంపెనీలు కూడా..
వీటితో పాటు అమెరికన్ కెమెరా అండ్ సోషల్ మీడియా కంపెనీ స్నాప్ (Snap) 20% మందిని, ఈ-కామర్స్ కంపెనీ షాపిఫై (Shopify) 10% మందిని, మొబిలిటీ సర్వీస్ కంపెనీ లిఫ్ట్ (Lyft) 13% మందిని, ఫైనాన్షియల్ సర్వీసెస్, సాఫ్ట్‌వేర్ కంపెనీ స్ట్రైప్ (Stripe) 14% మందిని, రియల్ ఎస్టేట్ స్టార్టప్ ఓపెన్‌డోర్ (Opendoor) 18% మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Soft ware, Tech employees