తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది. ఇటీవల కొత్తగా మంజూరు చేసిన 33 బీసీ గురుకులాలు (BC Gurukuls), 15 డిగ్రీ కళాశాలలను వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. బీసీ గురుకులాలను అక్టోబర్ 11న, డిగ్రీ కళాశాలలను (Degree colleges) అదే నెల 15న ప్రారంభించనున్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) ప్రకటించారు. కొత్తగా ప్రారంభించనున్నవాటిలో 17 గురుకులాలను బాలికలకు, మరో 16 గురుకులాలను బాలురకు కేటాయించారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం బీసీ గురుకులాల (BC Gurukuls) సంఖ్య 310కి పెరగనుంది.
అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం 80 వేల పై చిలుకు ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో బీసీ అభ్యర్థులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా మరో 50 బీసీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేస్తామని మంత్రి గుంగుల తెలిపారు. వాటి ద్వారా గ్రూప్స్, డీఎస్సీ, తదితర పోటీ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. స్టడీ సెంటర్ల (Study centers) ద్వారా దాదాపు 25 వేల మంది అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు గంగుల.
ఏయే ప్రాంతాల్లో గురుకులాలు?
బాలికల గురుకులాలు (Girl Gurukuls) ఏర్పాటయ్యే జిల్లాలలో జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్, వనపర్తి, రంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల , కరీంనగర్, పెద్దపల్లి , రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం , నల్లగొండ ఉన్నాయి. ఇక మిగిలిన 16 జిల్లాల్లో బాలుర గురుకులాలు ఏర్పాటు చేయనున్నారు. రంగారెడ్డి, సంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, వనపర్తి జిల్లాల్లో బాలికల డిగ్రీ కాలేజీలు ఏర్పాటుచేయనున్నారు. బాలుర డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసే ప్రాంతాలలో మహబూబ్‌నగర్, హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం , మేడ్చల్, సిరిసిల్ల, నాగార్జునసాగర్ ఉన్నాయి.
గురుకులానికో రూ.20 వేలు..
గిరిజన సంక్షేమశాఖ ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు ‘స్వచ్ఛ గురుకులం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. గురుకులాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల నుంచి అందరూ భాగస్వామ్యం అయ్యేలా కార్యాచరణ రూపొందించింది. ఇందుకు గురుకులానికో రూ.20 వేలను ప్రభుత్వం కేటాయించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గురుకులాలను (Telangana Gurukuls) ప్రోత్సాహించేందుకు నగదు బహుతులను ఇవ్వనున్నారు. స్వచ్ఛ గురుకులం కార్యక్రమం పూర్తి అయిన రోజు లేదా మరుసటి రోజు జిల్లా కలెక్టర్ నామినేట్ చేసిన అధికారి సంబంధిత గురుకులాన్ని సందర్శించి, పరిసరాలను తనిఖీ చేసి మార్కులు ఇస్తారు. వాటి ఆధారంగానే జిల్లా, రాష్ట్రస్థాయి బహుమతులను అందజేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన గురుకుల విద్యాలయాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వచ్ఛ గురుకుల ఉద్యమాన్ని నిర్వహించాలని, ఈ స్ఫూర్తి నిత్యం కొనసాగాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Degree students, EDUCATION, Gangula kamalakar, Gurukula colleges, Telangana, Ts gurukula