తెలంగాణలో(Telangana) ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. దీనిలో భాగంగానే ఇప్పటి వరకు 66వేలకు పైగా పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు లభించాయి. వీటిలో గ్రూప్ 1, గ్రూప్ 4, పోలీస్, పాలిటెక్నిక్ (Polytechnic) తో పాటు.. ఇతర ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు కూడా విడుదయ్యాయి. గత మూడు రోజుల నుంచి టీఎస్పీఎస్సీ నుంచి వరుసగా నోటిఫికేషన్లు(Notifications) విడుదల అవుతున్నాయి. వీటితో పాటు వైద్యుల నియామకానికి సంబంధించి 1400 పోస్టులకు కూడా.. వైద్య శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఒక వైపు పోలీస్ అభ్యర్థులకు ఈవెంట్స్ నిర్వహిస్తుండగా.. మరో వైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(Telangana Public Service Commission) నుంచి పలు నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. మరో రెండు రోజుల్లో గురుకుల ఉద్యోగాలకు సంబంధించి 10వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ కూడా రానుంది.
ఇదిలా ఉండగా.. నాలుగేళ్ల క్రిందట 9వేలకు పైగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను తెలంగాణ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఉద్యోగాలు సాధించిన కొంతమంది అభ్యర్థులు విధుల్లోకి చేరలేదు, మరి కొంత మంది ఇతర కారణాలతో రాజీనామాలు చేశారు. ఇలా 989 పోస్టులకు పైగా ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని తర్వాత ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా అభ్యర్థులను నియమించారు. పల్లె ప్రగతిలో భాగంగా.. ఏ ఒక్క గ్రామం కూడా అభివృద్ధికి దూరంగా ఉండకూడదని.. ప్రతీ గ్రామానికి పంచాయతీ కార్యదర్శి ఉండాలనే ఉద్దేశ్యంతో మూడేళ్ల క్రిందట ఈ పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా నియమించారు. అయితే ఈ పోస్టులను ప్రస్తుతం డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా నియమించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. వీటితో పాటు.. మరి కొన్ని పోస్టులను నోటిఫై చేస్తూ గతంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇప్పటికే ఈ పోస్టుల ఖాళీలను ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు అధికారులు. ఈ నెలలోనే ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 2560 పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. ప్రభుత్వం డైరెక్ట్ నియామకాల ద్వారా ఈ మిగిలిన పోస్టులను భర్తీ చేస్తుందని.. ఇకపై జిల్లా స్థాయిలో ఎక్కడా శాశ్వత ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టవద్దని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ జిల్లాల అధికారులను ఆదేశించింది. కొందరు జిల్లా పంచాయతీ అధికారులు ఈ ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్టు సమాచారం వచ్చిందని.. అటువంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. ఒక వేళ అత్యవసరం అయితే.. ఈ పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో విధుల్లోకి తీసుకోవాలని ఒక ప్రకటనలో సూచించారు. ఇలా రాష్ట్రంలో వరుస నోటిఫికేషన్లకు సంబంధించి ప్రకటనలు వెలువడటంతో.. నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షకు పరీక్షకు మధ్య కొంత కాల వ్యవధి ఉండే విధంగా అధికారులు పరీక్షలను నిర్వహించాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.