తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు 20 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వచ్చే నెలలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్న తరుణంలో నియామక ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థులకు ఏ దశలో కూడా ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఈసారి నియామక ప్రక్రియని మరింత సరళం చేసేందుకు ప్రత్యేక యాప్ రూపొందించాలని పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డ్ యోచిస్తోంది. దరఖాస్తు చేసుకోవడంలో అభ్యర్థులు ఇబ్బందులకు గురికాకుండా చూడడమే లక్ష్యంగా ఈ యాప్ ను తీసుకురానున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సమస్యలు రాకుండా చాడాలని అధికారులు ఆలోచిస్తున్నారు.
తెలంగాణ ఆవిర్భావం అనంతరం చేపట్టిన రెండు నియామకాలకు ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరించారు. అయితే దరఖాస్తుల అనంతరం పేరు తప్పుగా నమోదయిందని, కులం నమోదు కాలేదని ఇలా అనేక ఫిర్యాదులు అధికారులకు అందుతున్నాయి. దీంతో ఈ సమయంలో ఇలాంటి ఇబ్బందులు రాకుండా నివారించేందుకు ప్రత్యేక యాప్ రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు.
దీంతో ఈ సారి అభ్యర్థులు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏమైనా తప్పులు దొర్లినా వెంటనే సరి చేసుకునే అవకాశం సైతం కలగనుంది. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చేసే సూచనలు, ప్రకటనలు ఎప్పటికప్పుడు అభ్యర్థులకు చేరే అవకాశం కూడా యాప్ ద్వారా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఫిర్యాదులను కూడా యాప్ ద్వారే స్వీకరించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Telangana, Telangana Police, TS Police