జేఈఈ మెయిన్-2022 పరీక్షలకు సిద్ధమవుతున్నారా.. అయితే అలర్ట్. జేఈఈ మెయిన్ 2022 పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ ఏడాది నుంచి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాలుగు విడతల్లో జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈసారి ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్లు జరగనుండగా.. జేఈఈ షెడ్యూల్ మార్చే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా జేఈఈ (మెయిన్) 2022 నాలుగు సెషన్లను ఫిబ్రవరికి బదులుగా మార్చి నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే నీట్ (యూజీ) 2022 పరీక్ష ముందుగా నిర్ణయించినట్లుగానే షెడ్యూల్ ప్రకారం మేలో జరుగుతుంది. సెంట్రల్ యూనివర్సిటీలలో ప్రవేశానికి నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CET) జూన్‌లో జరుగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నందున, జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్‌పై ప్రభావం పడవచ్చని విద్యా మంత్రిత్వ శాఖ (ఎంఓఈ) అధికారులు తెలిపారు. ఈ ఏడాది నుంచి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అనే నాలుగు సార్లు జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
“అయితే పెండింగ్‌లో ఉన్న ఎన్నికలను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంవత్సరం జేఈఈ షెడ్యూల్‌ను కాస్త మార్చొచ్చు. మొదటి పరీక్షను ఫిబ్రవరిలో కాకుండా మార్చిలో నిర్వహించొచ్చు. తరువాత మిగతా విడతల పరీక్షలను ఏప్రిల్, మే, జూన్ నెలల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది” అని మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎంబీబీఎస్/డెంటల్ అడ్మిషన్ల కోసం నీట్ (యూజీ), సెంట్రల్ యూనివర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సెట్ (CET) అనే రెండు జాతీయ-స్థాయి ప్రవేశ పరీక్షలను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. ఐతే వీటిపై ఎలాంటి ఎన్నికల ప్రభావం పడదు.
నీట్ పరీక్ష మేలో, సెట్ ఎగ్జామ్ జూన్‌లో జరుగుతాయి. వచ్చే ఏడాది జరిగే పెద్ద పరీక్షలలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష (CET) కూడా ఒకటి. నిజానికి దీనిని తొలిసారిగా నిర్వహించడం జరుగుతోంది. ఇండియాలోని అన్ని సెంట్రల్ యూనివర్సిటీలలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఏ ఆధ్వర్యంలో సెట్‌ను నిర్వహించేందుకు యూజీసీ అనుకుంది. జాతీయ విద్యా విధానంలో భాగంగా 2021లోనే దీన్ని అమలు చేయాలని అనుకున్నారు.
కానీ కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. జాతీయ విద్యా విధానంలో ఈ పరీక్షను ఏడాదిలో రెండు మూడు సార్లు నిర్వహించాలని భావిస్తున్నారు. ఐతే తాజా సమాచారం ప్రకారం 2022లో ఒకసారి మాత్రమే నిర్వహిస్తారు. ఇప్పటికే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సెట్ టెస్ట్ కోసం సన్నద్ధం కావాలని యూనివర్సిటీలకు సూచించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, Jee, JEE Main 2021, JOBS