Home /News /ipl /

Womens T20 Challenge 2020: మహిళల ఐపీఎల్‌ కొత్త ఛాంపియన్‌‌గా ట్రైల్‌బ్లేజర్స్..

Womens T20 Challenge 2020: మహిళల ఐపీఎల్‌ కొత్త ఛాంపియన్‌‌గా ట్రైల్‌బ్లేజర్స్..

ట్రైల్ బ్లేజర్స్ గెలుపు (Image:IPL)

ట్రైల్ బ్లేజర్స్ గెలుపు (Image:IPL)

Womens T20 Challenge 2020: గత మ్యాచ్‌ల్లో అదరగొట్టిన చమారి ఆటపట్టు ఈ మ్యాచ్‌లో విఫలమైంది. అదే సూపర్‌నోవాస్ జట్టుకు మైనస్‌గా మారింది. ఆమె ఔటైన తర్వాత జట్టు ఎక్కడా పుంజుకోలేదు

  Womens T20 Challenge 2020, Final: ఉమెన్స్ టీ20 (మహిళల ఐపీఎల్)-2020 టైటిల్ విజేతగా ట్రైల్ బ్లేజర్స్ నిలిచింది. మూడేళ్లలో తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది. షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరుతో డిఫెండింగ్ ఛాంపియన్ సూపర్‌నోవాస్‌ను ఓడించింది. హర్మన్ ప్రీత్ సేనపై 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. 119 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని సూపర్ నోవాస్ ఛేదించలేకపోయింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 102 రన్స్ మాత్రమే చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ 30, సిరివర్దనే 19, తానియా భాటియా 14, రోడ్రిగ్స్ 13 పరుగులు చేశారు. ఆటపట్టు 6, అనూజ పాటిల్ 8, పూజా వస్త్రాకర్ 0, రాధా 5*, షకీరా 4* రన్స్ మాత్రమే చేశారు.

  ఇన్నింగ్స్ ఆరంభం నుంచే హర్మన్ ప్రీత్ సేన ఇబ్బందులు పడింది. రెండో ఓవర్‌లోనే సూపర్ నోవాస్ స్టార్ బ్యాటర్ ఆటపట్టు ఔట్ అయింది. గత మ్యాచ్‌ల్లో అదరగొట్టిన చమారి ఆటపట్టు ఈ మ్యాచ్‌లో విఫలమైంది. అదే సూపర్‌నోవాస్ జట్టుకు మైనస్‌గా మారింది. ఆమె ఔటైన తర్వాత జట్టు ఎక్కడా పుంజుకోలేదు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ పోరాడినప్పటికీ.. అది సరిపోలేదు. మిగతా ఎవ్వరూ రాణించకపోవడంతో సూపర్ నోవాస్‌కు ఓటమి తప్పలేదు. ఇక ట్రైల్ బ్లేజర్స్ బౌలర్లలో సల్మా ఖాతున్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. 4 ఓవర్లలో 18 పరుగులు ఇఛ్చి 3 వికెట్లు తీసింది. ఆ మూడు వికెట్లు చివరి ఓవర్లోనే పడడం విశేషం. దీప్తి శర్మకు రెండు, సోఫీ ఎకిల్‌స్టన్ ఒక వికెట్ దక్కాయి.


  టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ట్రైల్ బ్లేజర్స్ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధన క్లాస్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. 49 బంతుల్లో 68 పరుగులు చేసింది. ఇందులో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. ఇక డియాండ్రా డాటిన్ 20 , రిచా ఘోష్ 10 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్స్ ఎవరూ రాణించలేదు. సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. దీప్తి శర్మ 9, హర్లీన్ డియోల్ 4, సోఫీ ఎకిల్‌స్టన్ 1, జులన్ గోస్వామి 1, చంతమ్ 0 రన్స్‌తో అట్టర్ ఫ్లాప్ అయ్యారు.

  మొదట బ్యాటింగ్‌కు దిగిన సూపర్ బ్లేజర్స్‌కు డాటిన్, స్మతి మంధన అద్భుతమైన స్టార్ట్ ఇచ్చారు. దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. భారీ స్కోర్ సాధించేలా కనిపించారు. కానీ 12వ ఓవర్లో డాటిన్ ఔట్ అయింది. అనంతరం వచ్చిన రిచా ఘోష్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది స్మృతి మంధన. చూడచక్కని షాట్స్‌ ఆడుతూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఇదే దూకుడు కొనసాగిస్తే స్మృతి సెంచరీ చేస్తుందని అందరూ అనుకున్నారు. ఐతే15వ ఓవర్లో స్టంపౌట్ రూపంలో వికెట్ల ముందు దొరికిపోయింది. స్మృతి ఔటౌన తర్వాత.. ట్రైల్ బ్లేజర్స్ టీమ్ స్కోర్ పూర్తిగా పడిపోయింది.

  సూపర్ నోవాస్ బౌలర్ రాధా ధాటికి వరుసగా వికెట్లు పడ్డాయి. బ్యాటర్స్ అంతా ఇలా వచ్చి అలా వెళ్లారు. 6 పరుగుల వ్యవధిలోనే 6 వికెట్లు కోల్పోయిందంటే.. రాధా ఎంతగా దెబ్బకొట్టిందో అర్ధం చేసుకోవచ్చు. చివరి ఐదు ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే చేయలగలిగారు ట్రైల్ బ్లేజర్స్. రాధా యాదవ్ అద్భుతమైన బౌలింగ్‌తో స్మృతి గ్యాంగ్‌ను కట్టడి చేయగలిగింది. సూపర్ నోవాస్ బౌలర్లలో రాధా యాదవ్ రెచ్చిపోయింది. అద్భుతమమైన స్పెల్‌తో ట్రైల్ బ్లేజర్స్‌ను దెబ్బకొట్టింది. 4 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చిన ఐదు వికెట్లు పడగొట్టింది రాధా. పూనమ్ యాదవ్, శశికళ సిరివర్దనేకు తలో వికెట్ దక్కాయి.

  కాగా, మహిళల టీ20 ఛాలెంజ్‌లో ఇది మూడో సీజన్. తొలి రెండు సీజన్లలో సూపన్ నోవాస్ విజయం సాధించింది. ఈసారి ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఓడిపోవడంతో..కొత్త ఛాంపియన్‌గా స్మృతి మంధన నేతృత్వంలోని ట్రైల్ బ్లేజర్ అవతరించింది. రన్నరప్‌గా సూపర్ నోవాస్ నిలిచింది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Cricket, Supernovas, Trailblazers, Women's Cricket, Women’s T20 Challenge 2020

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు