Home /News /ipl /

WILL RESIGN FOR CM POST IF BJP PROVE CENTRE GIVING PENSION SAYS CM KCR SK

CM KCR: నిరూపిస్తే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా.. సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

కేంద్రమే రూ. 2016ల పెన్షన్ ఇస్తుందని ఎవరైనా నిరూపిస్తే.. ఒకే ఒక్క నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.

    దుబ్బాక ఎన్నికలు సమీపించే కొద్దీ తెలంగాణ రాజకీయాలు అంతకంతకు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా దుబ్బాక కేంద్రంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పెన్షన్ విషయంలో ఇరు పార్టీ నేతలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కేంద్రమే ఇస్తున్నామని బీజేపీ, తెలంగాణ ప్రభుత్వం ఇస్తోందని టీఆర్ఎస్.. ఇలా ఇరువర్గాల నేతల మాటల తూటాలు పేల్చుతున్నారు. ఈ క్రమంలో పెన్షన్లపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచే పెన్షన్లను ఇస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్రమే ఇస్తుందని ఎవరైనా నిరూపిస్తే.. ఒకే ఒక్క నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. శనివారం జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభోత్సవం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్.

    ''దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తోంది. దేశాన్ని పరిపాలించే బీజేపీ పెన్షన్ల విషయంలో అవాస్తవాలు మాట్లాడుతోంది. తెలంగాణలో 38,64,751 మందికి ఒక్కొక్కరికి రూ.2016 చొప్పున పింఛన్లు ఇస్తున్నాం. కేంద్రం తరఫున 6,95,000 మందికి రూ.200ల చొప్పున మాత్రమే ఇస్తున్నారు. పించన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా రూ.11వేల కోట్లు ఖర్చు చేస్తోంది. కేంద్రం రూ.105 కోట్లు మాత్రమే ఇస్తోంది. కానీ బీజేపీ నేతలు మాత్రం రూ.2016 పింఛనులో రూ.1600లను కేంద్రమే ఇస్తున్నట్టు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. పింఛన్ల విషయంలో తాను చెప్పేది అబద్ధమని ఎవరైనా నిరుపిస్తే ఒక్క నిమిషంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతా.'' అని సీఎం కేసీఆర్ అన్నారు.


    నిజాయతీ లేని ప్రభుత్వాన్ని బదనాం చేస్తారేమో గానీ.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. దుబ్బాకలో బ్రహ్మాండంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, దుబ్బాకలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. దుబ్బాక ఉపఎన్నికల పోలింగ్ నవంబరు 3న జరుగుతుంది. నవంబరు 10న ఫలితాలను ప్రకటిస్తారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నికలు వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీ తరఫున రామలింగారెడ్డి భార్య సుజాత పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగారు. ఇక బీజేపీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసి ఓడిన రఘునందన్ రావు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, Dubbaka By Elections 2020, Telangana

    తదుపరి వార్తలు