• HOME
 • »
 • NEWS
 • »
 • IPL
 • »
 • WARNER RESCUES IYER AFTER DC SKIPPER HILARIOUSLY FORGETS CHANGES IN LINE UP FOR QUALIFIER 2 VS SRH SK

Shreyas Iyer: అయ్యో.. అయ్యర్.. నీకు జట్టు సభ్యులే గుర్తులేరా.. ఫన్నీ వీడియో

Shreyas Iyer: అయ్యో.. అయ్యర్.. నీకు జట్టు సభ్యులే గుర్తులేరా.. ఫన్నీ వీడియో

శ్రేయస్ అయ్యర్

వీడియో చూసిన నెటిజన్లు.. అయ్యో అయ్యర్.. నీకు జట్టు సభ్యుల పేర్లే గుర్తు లేవా అంటూ జోకులు పేల్చుతున్నారు.

 • Share this:
  క్రికెట్ టీమ్‌లో కెప్టెన్ పాత్ర చాలా ముఖ్యమైనది. తుది జట్టు ఎంపిక మొదలు.. గ్రౌండ్‌లో అప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ జట్టును విజయం దిశగా నడిపించాలి. టీమ్‌లో ఎవరు ఎలా ఆడతారు? ఏ పొజిషన్‌లో పంపిస్తే రాణిస్తారు? ఏ ఓవర్‌లో ఏ బౌలర్‌ను రంగంలోకి దించాలి? ఇలాంటి విషయాలన్నీ తెలిసి ఉండాలి. టీమ్‌కు అన్ని విధాలుగా రెస్సాన్సిబిలీటీ అతడిదే..! అలాంటి కెప్టెన్‌కు టీమ్‌ సభ్యుల పేర్లు గుర్తుండవా..? అసలు జట్టులో ఎవరు ఉన్నారో తెలియదా? అదేం ప్రశ్న.. సభ్యుల పేర్లు తెలియకుండానే జట్టును నడిపిస్తారా? అని మీరు అనుకోవచ్చు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయస్ అయ్యర్‌కు ఇలాంటి అనుభవమే ఎదరయింది. జట్టులో ఓ కీలక ఆటగాడి పేరు మర్చిపోయి.. నవ్వుల పాలయ్యాడు. ప్రత్యర్థి టీమ్ కెప్టెన్ గుర్తు చేస్తే గానీ.. అతడి పేరు తట్టలేదు.

  ఆదివారం అబుదాబి వేదికగా ఐపీఎల్ క్వాలిఫైయర్-2 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.హైదరాబాద్ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో గెలిచి.. ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఐతే మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆసక్తికర ఘటన జరిగింది. టాస్ వేసేందుకు సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గ్రౌండ్‌లోకి వచ్చారు. టాస్ గెలిచిన అయ్యర్.. మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు. అనంతరం జట్టులో మార్పుల గురించి హోస్ట్ మార్క్ నికోలస్‌తో మాట్లాడుతూ.. గందరగోళానికి గురయ్యాడు. రెండు మార్పులు చేశామని చెప్పిన ఢిల్లీ కెప్టెన్.. పృథ్వీషా స్థానంలో ప్రవీణ్ దూబె జట్టులోకి వచ్చాడని చెప్పాడు. మరొకరి పేరు మర్చిపోయి.. తడబడ్డాడు. ఎవరబ్బా..? అని గుర్తు చేసుకునే క్రమంలో కాసేపు ఆలోచించాడు. అతడి పేరు గుర్తు రాక ఇబ్బందిపడ్డాడు. ఐతే పక్కనే ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. 'హెట్‌మెయిర్' అని చెప్పడంతో.. 'ఆ హెట్‌మెయిర్' అని చెప్పాడు శ్రేయస్ అయ్యాడు. దాంతో అక్కడ నవ్వులు పూశాయి. వార్నర్ ముసిముసి నవ్వులు నవ్వాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు.. అయ్యో అయ్యర్.. నీకు జట్టు సభ్యుల పేర్లే గుర్తు లేవా అంటూ జోకులు పేల్చుతున్నారు.

  క్వాలిఫైయర్2 మ్యాచ్‌లో హైదరాబాద్ టీమ్‌పై 17 పరుగులతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదట ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 50 బంతుల్లో 78 పరుగులతో రఫ్పాడించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్‌లో వచ్చిన స్టోయినిస్ దూకుడుగా ఆడి 38 రన్స్ సాధించాడు. హెట్‌మెయిర్ కూడా 42 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ 21 పరుగులతో పరవా లేదనిపించాడు. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, హోల్డర్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు. ఐతే షాబాజ్ నదీమ్, హోల్డర్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మిస్ ఫీల్డింగ్‌తో పాటు క్యాచ్‌లను వదిలేయడం కూడా ఢిల్లీకి కలిసి వచ్చింది.

  అనంతరం బరిలోకి దిగిన హైదరాబాద్ టీమ్.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులు మాత్రమే చేసింది. కేన్ విలియమ్సన్ పోరాడినా ఆఖరి వరకు ఉండకపోవడంతో జట్టును గెలిపించలేకపోయాడు. అతడు 45 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అబ్దుల్ సమద్ 16 బంతుల్లో 33 రన్స్ చేశాడు. మనీష్ పాండే 21 పరుగులు సాధించాడు. వార్నర్ 2, ప్రియం గార్గ్ 17, జేసన్ హోల్డర్ 11, రషీద్ ఖాన్ 11, గోస్వామి 0కే పరిమితమయ్యారు. నదీమ్ 2, సందీప్ శర్మ2 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో కాగిసో రబడ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇందులో నాలుగు వికెట్లు 19వ ఓవర్‌లోనే పడగొట్టాడు. ఇక మార్కస్ స్టోయినిస్ 3 వికెట్లు సాధించాడు. అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో టోర్నీ నుంచి హైదరాబాద్ నిష్క్రమించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్‌కు వెళ్లింది.
  Published by:Shiva Kumar Addula
  First published: