ఐపీఎల్ 2020 టోర్నీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సూర్యకుమార్ యాదవ్. ముంబై ఇండియన్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యకుమార్.. ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. చూడ చక్కని బ్యాటింగ్‌తో టీమిండియా మాజీ ఆటగాళ్లను ఫిదా చేస్తున్నాడు. అతడిని టీమిండియాలోకి తీసుకోవాలన్న డిమాండ్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సూర్యను టీమిండియాకు ఎంపిక చేసేందుకు ఇదే సరైన సమయమని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఐపీఎల్లో కొత్త చరిత్రను లిఖించాడు సూర్యకుమార్ యాదవ్.
ఐపీఎల్లో 100 మ్యాచ్‌లు ఆడిన వన్ అండ్ ఓన్లీ అన్క్యాప్డ్ (జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని) ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. అంతేకాదు 2వేల పరుగులు సాధించిన ఒకే ఒక్క అన్క్యాప్డ్ ప్లేయర్ కూడా సూర్యకుమార్ యాదవే. గురువారం దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ అందుకున్నాడు.
సూర్యకుమార్ యాదవ్ ఎనిమిదేళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నాడు. 2012లో తొలిసారి ముంబై జట్టు అతడిని తీసుకుంది. ఐతే సచిన్, రోహిత్ శర్మ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్ ఉండడంతో తుది జట్టులో చోటు దక్కలేదు. ఐతే 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ సూర్యను కొనుగోలు చేసింది. 2017 వరకు కేకేఆర్ తరపున ఆడిన అతడిని.. 2018లొ ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. గత మూడు సీజన్లలో అద్భుతంగా రాణిస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్. 2018లో 512, 2019లో 424, 2020లో ఇప్పటి వరకు 461 పరుగులు సాధించాడు.
ORANGE CAP:
PURPLE CAP:
సూర్యను జాతీయ జట్టులోకి తీసుకోవాలని హర్భజన్ సింగ్, గౌతం గౌంభీర్ వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అతడిని టీమిండియాకు ఎంపిక చేయడానికి ఇదే సరైన సమయమని బీసీసీఐకి సూచిస్తున్నారు. మరోవైపు సూర్యకుమార్‌తో పాటు మరో ఐదుగురు ఆటగాళ్ల ప్రదర్శనకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఫిదా అయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (ముంబై ఇండియన్స్), సంజూ శామ్సన్ (రాజస్థాన్), రాహుల్ త్రిపాఠి (కోల్‌కతా నైట్ రైడర్స్), వరుణ్ చక్రవర్తి (కోల్‌కతా నైట్ రైడర్స్), శుభమాన్ గిల్ (కోల్‌కతా నైట్ రైడర్స్), దేవదత్ పడిక్కల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) ఆటగాళ్ల ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశారు. మరి వీళ్లలో ఎవరు త్వరలో జాతీయ జట్టులో కనిపిస్తారో చూడాలి.