Home /News /ipl /

SRH VS KXIP IPL 2020 LIVE UPDATES KINGS ELEVEN PUNJAB VS SUN RISERS HYDERABAD PUNJAB WON BY 12 RUNS SK

SRH vs KXIP: లోస్కోర్ మ్యాచ్‌లో చేజేతులా ఓడిన హైదరాబాద్.. పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ

పంజాబ్ విజయం (Image:IPL)

పంజాబ్ విజయం (Image:IPL)

SRH vs KXIP, IPL 2020: పంజాబ్ విధించిన తక్కువ లక్ష్యాన్ని కూడా హైదరాబాద్ చేధించలేకపోయింది. అలవోకగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా ఓడగొట్టుకుంది. ఆఖరి ఓవర్ వరకు తీసుకెళ్లి పరాజయం పాలయింది.

    SRH vs KXIP, IPL 2020: దుబయ్‌లో జరిగిన లోస్కోర్ ఉత్కంఠ పోరులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయం సాధించింది. 12 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. పంజాబ్ విధించిన తక్కువ లక్ష్యాన్ని కూడా హైదరాబాద్ చేధించలేకపోయింది. అలవోకగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా ఓడగొట్టుకుంది. ఆఖరి ఓవర్ వరకు తీసుకెళ్లి పరాజయం పాలయింది. చివరి ఓవర్లో అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో వార్నర్ సేన చిత్తుగా ఓడింది. 19.5 ఓవర్లలో 114 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయింది. డేవిడ్ వార్నర్ 35, విజయ్ శంకర్ 26 తప్పించి ఎవరూ రాణించలేదు. జానీ బెయిర్‌స్టో 19, మనీష్ పాండే 15, సమద్ 7, ప్రియం గార్గ్, హోల్డర్ 5, రషీద్ ఖాన్ 0, సందీప్ శర్మ 0, ఖలీల్ అహ్మద్ 0 పరుగులు చేశారు.

    జట్టుకు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో శుభారంభం ఇచ్చారు. కానీ ఏడో ఓవర్లో తొలి వికెట్ పడడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. 56, 58 పరుగుల వద్ద వార్నర్, బెయిర్ స్టో ఔట్ అవడంతో.. సన్ రైజర్స్ స్కోర్ నెమ్మదించింది. ఆ తర్వాత కాసేపటికే సమద్ వెనుదిరిగాడు. లక్ష్యం తక్కువగా ఉన్నా.. వికెట్లు వరుసగా పడడంతో కాస్త ఇబ్బందిగా మారింది. ఐతే గత మ్యాచ్‌ను గెలిపించిన మనీష్ పాండే, విజయ్ శంకర్.. ఇవాళ కూడా చక్కని భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ 17వ ఓవర్లో మనీష్ ఔటవడంతో మళ్లీ స్కోర్ వేగం తగ్గింది. హోల్డర్‌తో కలిసి విజయ్ శంకర్ మ్యాచ్ గెలిపిస్తాడనుకున్న వేళ..18వ ఓవర్లో అర్షదీప్ మంచి బ్రేక్‌థ్రూ ఇచ్చాడు. విజయ్ శంకర్‌ని ఔట్ చేయడంతో హైదరాబాద్ కష్టాల్లో పడింది. ఆ మరుసటి ఓవర్లోనే హోల్డర్, రషీద్ ఖాన్ వరుస బంతుల్లో ఔట్ అవడంతో.. పీకల్లోతు కష్టాల్లో మునిగింది SRH. చివరి ఓవర్లో సందీప్, ప్రియం గార్గ్, ఖలీల్ అహ్మద్ ఔటవడంతో.. హైదరాబాద్ ఓడిపోయింది.

    పంజాబ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్, అర్షదీప్ అదరగొట్టారు. జోర్డాన్ 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక అర్షదీప్ 3.5 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. మహమ్మద్ షమి, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.


    టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ జట్టు.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లు చక్కగా బౌలింగ్ చేసి.. పంజాబ్‌ను కట్టడి చేశారు. నికోలస్ పూరన్ (32), కెప్టెన్ కేఎల్ రాహుల్ (27), క్రిస్ గేల్ (20) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. మిగతా వారంతా విఫలమయ్యారు. మన్‌దీప్ సింగ్ 17, గ్లెన్ మాక్స్‌వెల్ 12, దీపక్ హుడా 0, క్రిస్ జోర్డాన్ 7 రన్స్ మాత్రమే చేశారు.

    ఐదో ఓవర్లో మన్‌దీప్ సింగ్ ఔటైన తర్వాత క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ ఇన్సింగ్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఐతే జట్టు స్కోర్ 66 వద్ద క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ వరుసగా ఔట్ అవడంతో.. పంజాబ్ పతన ప్రారంభమయింది. అనంతరం మెల్లమెల్లగా వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఫలితంగా రన్ రేట్ తగ్గిపోయి.. 126 పరుగులకు పరిమితమయింది పంజాబ్ జట్టు. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

    ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు ఇప్పటి వరకు 16 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. హైదరాబాద్ టీమ్ ఏకంగా 11 సార్లు, పంజాబ్‌ 5 సార్లు గెలిచాయి. ఐపీఎల్ 2020 టోర్నీలో ఇంతకుముందు ఓసారి ఇరు జట్లు మ్యాచ్ ఆడాయి. అక్టోబరు 8న దుబాయ్ జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఏకంగా 69 పరుగులు తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచి హైదరాబాద్‌పై ప్రతీకారం తీర్చుకుంది పంజాబ్. అంతేకాదు ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. హైదరాబాద్ జట్టు ఆరో స్థానానికి పడిపోయింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: IPL, IPL 2020, Kings XI Punjab, Sun risers hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు