SRH vs DC, IPL 2020 Qualifier2: ఐపీఎల్ 2020 టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. కీలకమైన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో వార్నర్ సేన ఓడిపోయింది. ఢిల్లీ విధించిన భారీ లక్ష్యాన్ని చేధించలేక చేతులెత్తేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతేకాదు ఐపీఎల్ ఫైనల్లో అడుగు పెట్టింది. ఢిల్లీ టీమ్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులు మాత్రమే చేసింది. కేన్ విలియమ్సన్ పోరాడినా ఆఖరి వరకు ఉండకపోవడంతో జట్టును గెలిపించలేకపోయాడు. అతడు 45 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అబ్దుల్ సమద్ 16 బంతుల్లో 33 రన్స్ చేశాడు. మనీష్ పాండే 21 పరుగులు సాధించాడు. వార్నర్ 2, ప్రియం గార్గ్ 17, జేసన్ హోల్డర్ 11, రషీద్ ఖాన్ 11, గోస్వామి 0కే పరిమితమయ్యారు. నదీమ్ 2, సందీప్ శర్మ2 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇన్నింగ్స్ హైదరాబాద్ ఆరంభంలోనే తడబడింది. రెండో ఓవర్లోనే కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన మనీశ్ పాండే ధాటిగా ఆడాడు. ఐతే ఐదో ఓవర్లో గార్గ్‌తో పాటు ఊపు మీదున్న పాండే కూడా ఔట్ అయ్యాడు. హోల్డర్స్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు విలియమ్సన్. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 46 పరుగల భాగస్వామ్యం నెలకొల్పారు. 12 ఓవర్లో హోల్డర్ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సమద్..ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. విలియమ్సన్, సమద్ ఇద్దరూ ధాటిగా ఆడుతూ ఢిల్లీ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఐతే 17వ ఓవర్లో స్టోయినిస్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. విలియమ్సన్‌ను ఔట్ చేయడంతో హైదరాబాద్ టీమ్ కష్టాల్లో పడింది. అనంతరం రషీద్, సమద్ కాసేపు మెరుపులు మెరిపించి.. సన్‌రైజర్స్ జట్టులో ఆశలు రేపారు. ఐతే 19వ ఓవర్లో సమద్, రషీద్ ఖాన్, గోస్వామి మూడు వరుస బంతుల్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైంది.
ఢిల్లీ బౌలర్లలో కాగిసో రబడ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇందులో నాలుగు వికెట్లు 19వ ఓవర్లోనే పడగొట్టాడు. ఇక మార్కస్ స్టోయినిస్ 3 వికెట్లు సాధించాడు. అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది.
టాస్ గెలిచి మొదట ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 50 బంతుల్లో 78 పరుగులతో రఫ్పాడించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్‌లో వచ్చిన స్టోయినిస్ దూకుడుగా ఆడి 38 రన్స్ సాధించాడు. హెట్మెయిర్ కూడా 42 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ 21 పరుగులతో పరవా లేదనిపించాడు.
ఢిల్లీకి ఓపెనర్లు ధావన్, స్టోయినిస్ శుభారంభం అందించారు. పవర్ ప్లేలో పరుగుల వరద పారించారు. ఇద్దరు దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. పవర్ ప్లేలో ఏకంగా 65 రన్స్ పిండుకున్నారు. వీరిద్దరు 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 9వ ఓవర్లో స్టోయినిస్ వికెట్ పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌తో కలిసి తన దూకుడును కొనసాగించాడు ధావన్. ఐతే 14వ ఓవర్లో శ్రేయస్ ఔట్ కావడంతో బ్యాటింగ్‌కు దిగిన హెట్మెయిర్..వస్తూనే హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్ల మోత మోగించాడు. 19వ ఓవర్లో ధావన్ ఔట్ కావడంతో...ఆఖరులో స్కోర్ కాస్త తగ్గింది. లేదంటే 200లు దాటేది.
హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, హోల్డర్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు. ఐతే షాబాజ్ నదీమ్, హోల్డర్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మిస్ ఫీల్డింగ్‌తో పాటు క్యాచ్‌లను వదిలేయడం కూడా ఢిల్లీకి కలిసి వచ్చింది.
ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు 18 సార్లు ముఖా ముఖి తలపడ్డాయి. హైదరాబాద్ టీమ్ 11 సార్లు గెలవగా.. ఢిల్లీ జట్టు 7 సార్లు విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇంతకు ముందు రెండు సార్లు ఇరు జట్లు ఢీకొన్నాయి. సెప్టెంబరు 29న అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై సన్‌రైజర్స్ జట్టు 15 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక అక్టోబరు 27న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 88 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఐతే కీలకమైన క్వాలిఫైయర్2 మ్యాచ్‌లో మాత్రం ఢిల్లీ చేతిలో ఓడిపోయి.. ఇంటి బాట పట్టింది.