SRH vs DC, IPL 2020 Qualifier2: కీలకమైన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) అదరగొట్టింది. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసి విజయవంతమైంది. ఓపెనర్లు శిఖర్ ధావన్, స్టోయినిస్‌తో పాటు నాలుగో స్థానంలో వచ్చిన హెట్మెయిర్ అద్భుతంగా ఆడారు. అందరూ రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 50 బంతుల్లో 78 పరుగులతో రఫ్పాడించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్‌లో వచ్చిన స్టోయినిస్ దూకుడుగా ఆడి 38 రన్స్ సాధించాడు. హెట్మెయిర్ కూడా 42 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ 21 పరుగులతో పరవా లేదనిపించాడు.
ఢిల్లీకి ఓపెనర్లు ధావన్, స్టోయినిస్ శుభారంభం అందించారు. పవర్ ప్లేలో పరుగుల వరద పారించారు. ఇద్దరు దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. పవర్ ప్లేలో ఏకంగా 65 రన్స్ పిండుకున్నారు. వీరిద్దరు 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 9వ ఓవర్లో స్టోయినిస్ వికెట్ పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌తో కలిసి తన దూకుడును కొనసాగించాడు ధావన్. ఐతే 14వ ఓవర్లో శ్రేయస్ ఔట్ కావడంతో బ్యాటింగ్‌కు దిగిన హెట్మెయిర్..వస్తూనే హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్ల మోత మోగించాడు. 19వ ఓవర్లో ధావన్ ఔట్ కావడంతో...ఆఖరులో స్కోర్ కాస్త తగ్గింది. లేదంటే 200లు దాటేది.
హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, హోల్డర్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు. ఐతే షాబాజ్ నదీమ్, హోల్డర్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మిస్ ఫీల్డింగ్‌తో పాటు క్యాచ్‌లను వదిలేయడం కూడా ఢిల్లీకి కలిసి వచ్చింది.
ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు 17 సార్లు ముఖా ముఖి తలపడ్డాయి. హైదరాబాద్ టీమ్ 11 సార్లు గెలవగా.. ఢిల్లీ జట్టు 6 సార్లు విజయం సాధించింది. ఈ లెక్కన ఢిల్లీలో SRHదే పై చేయి. ఈ టోర్నీలో ఇంతకు ముందు రెండు సార్లు ఇరు జట్లు ఢీకొన్నాయి. సెప్టెంబరు 29న అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై సన్‌రైజర్స్ జట్టు 15 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక అక్టోబరు 27న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 88 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. అంటే ఈ సీజన్లో కూడా ఢిల్లీపై హైదరాబాద్‌పై చేయి సాధించింది.
లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక..పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్‌ల్లో ఎనిమిది గెలిచి.. మరో ఆరింట ఓడిపోయింది. ఇక హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్‌ల్లో ఏడు గెలిచి.. మరో ఏడింట పరాజయం పాలయింది. ఐతే క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో ముంబై చేతిలో ఢిల్లీ ఓడిపోవడం.. టాప్ ఆర్డర్ నిలకడలేమితో.. ఆ జట్టు ఇబ్బందులు పడుతోంది. మరోవైపు వరుస విజయాలతో హైదరాబాద్ దూకుడు మీదుంది.
ఈ మ్యాచ్ ఇరు జట్లకు డూర్ ఆర్ డై లాంటింది. గెలిస్తే ఫైనల్‌కు వెళ్తారు. లేదంటే ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్తారు. అందుకే క్వాలిఫైయర్-2లో ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.