MI CAPTAIN ROHIT SHARMA IS A MIXTURE OF MS DHONI AND SOURAV GANGULY SAYS IRFAN PATHAN MS
IPL 2020: వాళ్లద్దరి మిశ్రమమే రోహిత్ శర్మ అంటున్న ఇర్ఫాన్ పఠాన్
రోహిత్ శర్మ (Image:IPL)
వరుసగా రెండో ఐపీఎల్ తో పాటు ఐదు ఐపీఎల్స్ సాధించిన రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. అతడిని టీం ఇండియా కెప్టెన్ గా నియమించాలని అందరూ అంటున్నారు.
ఐపీఎల్ 2020 లో ముంబయి ఇండియన్స్ కు కప్ అందించిన తర్వాత రోహిత్ శర్మ మరో మెట్టు ఎదిగాడు. టీంఇండియా ఇక ఆలస్యం చేయకుండా రోహిత్ శర్మను భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా నియమించాలని క్రికెట్ అభిమానులు అంటున్నారు. తాజాగా వీరికి ఇండియన్ మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా జతకలిశాడు. రోహిత్ శర్మ మామూలు ఆటగాడు కాదని.. అతని నాయకత్వ ప్రతిభకు ఐపీఎల్ ఫైనలే రుజువని అన్నాడు. భారత జట్టు మాజీ కెప్టెన్ లు సౌరవ్ గంగూలి, జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని లతో రోహిత్ ను పోల్చాడు.
ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ‘భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనిల మిశ్రమమే రోహిత్ శర్మ. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో అతడి నాయకత్వ ప్రతిభ మరోసారి వెల్లడైంది. అతడు సూర్యకుమార్ యాదవ్ ను ఉపయోగించుకున్న విధానం అద్భుతం. ఎవరైనా ఒక కెప్టెన్ ఇన్నింగ్స్ ను ప్రారంభించేప్పుడు ఒక సీమర్ తో బౌలింగ్ వేయిస్తాడు. కానీ రోహిత్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించాడు. అంతేగాక బూమ్రా, పొలార్డ్ లను ఉపయోగించిన విధానం కూడా అమోఘం. వారిని ఎక్కడ అవసరమో అక్కడ రోహిత్ వాడుకున్నాడు. అది ఆటమీద అతడికున్న అవగాహనను చూపిస్తుంది.’ అని అన్నాడు.
ఇర్ఫాన్ పఠాన్ (ఫైల్)
గంగూలీ కూడా తన బౌలర్లను నమ్మేవాడని పఠాన్ అన్నాడు. ధోని సైతం తన బౌలర్లను మార్చుతూ ఫలితాలు రాబట్టేవాడని చెప్పాడు. రోహిత్ బౌలర్ల కెప్టెన్ అని కొనియాడాడు. గంగూలీ, ధోనిలోని లక్షణాలు చాలా వరకు రోహిత్ లో కనిపిస్తున్నాయని పఠాన్ తెలిపాడు. మ్యాచ్ సందర్భంగా రోహిత్ అవలంభించిన వ్యూహాలు, బౌలర్లను మార్చిన విధానం.. ఇవన్నీ అతడు పరిపూర్ణమైన కెప్టెన్ అని మరోసారి రుజువు చేస్తున్నాయని పఠాన్ వివరించాడు.
కాగా, ముంబయి ఇండియన్స్ కు ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్.. విజయవంతమైన కెప్టెన్ గా పేరు పొందాడు. ముంబయి తరఫున ఐదు ట్రోఫీలతో పాటు.. 2009 లో హైదరాబాద్ ఐపీఎల్ ట్రోఫీ నెగ్గినప్పుడు కూడా రోహిత్.. దక్కన్ ఛార్జర్స్ లో సభ్యుడు కావడం గమనార్హం. ఇటీవలే ఐపీఎల్ సందర్భంగా గాయపడ్డా.. ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ ఇరగదీశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటను వెళ్లాడు.