హోమ్ /వార్తలు /ఐపీఎల్ 2020 /

KXIP vs RR, IPL 2020: డూ ఆర్ డై మ్యాచ్‌లో రాజస్థాన్ గెలుపు.. ప్లేఆఫ్స్ రేస్ రసవత్తరం

KXIP vs RR, IPL 2020: డూ ఆర్ డై మ్యాచ్‌లో రాజస్థాన్ గెలుపు.. ప్లేఆఫ్స్ రేస్ రసవత్తరం

బెన్ స్టోక్స్ (Image:IPL)

బెన్ స్టోక్స్ (Image:IPL)

KXIP vs RR, IPL 2020: రాజస్థాన్ బ్యాట్స్‌మెన్స్ అందరూ అదరగొట్టారు. ఎలాంటి తడబాటు లేకుండా కూల్‌గా ఆడారు. బెన్‌స్టోక్స్ ఇచ్చిన శుభారంభాన్ని మిగతా వారు అదే జోష్‌తో కొనసాగించారు.

IPL 2020: డూ ఆర్ డై మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం సాధించింది. పంజాబ్ వరుస విజయాలకు బ్రేకులు వేసింది. అబుదాబిలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై గెలిచి.. ప్లే ఆశలను సజీవంగా ఉంచుకుంది ఆర్ఆర్ టీమ్. 186 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా రాయల్స్ బ్యాట్స్‌మెన్ చాలా అలవోగా చేధించారు. 3 వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్స్ అందరూ అదరగొట్టారు. ఎలాంటి తడబాటు లేకుండా కూల్‌గా ఆడారు. బెన్‌స్టోక్స్ ఇచ్చిన శుభారంభాన్ని మిగతా వారు అదే జోష్‌తో కొనసాగించారు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడడంతో భారీ లక్ష్యాన్ని కూడా ఈజీగా చేధించారు.  బెన్ స్టోక్స్ 50, సంజూ శామ్సన్ 48, స్టీవ్ స్మిత్ 31, రాబిన్ ఊతప్ప 30,  జోస్ బట్లర్ 22 పరుగులు చేశారు. కింగ్స్ బౌలర్లలో మురుగన్ అశ్విన్, క్రిస్ జోర్డాన్ తలో వికెట్ పడగొట్టారు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 4 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. యూనివర్స్ స్టార్ క్రిస్ గేల్ సిక్స్‌ల మోత మోగించాడు. 63 బంతుల్లో 99 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇందులో 6 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. ఒకే ఒక్క పరుగుతో సెంచరీ మిస్ చేసుకున్నాడు క్రిస్ గేల్. కేఎల్ రాహుల్ 46, నికోలస్ పూరన్ 22 రన్స్ చేశాడు. మందీప్ సింగ్ డకౌట్ అయ్యాడు. గ్లెన్ మాక్స్‌వెల్ 6, దీపక్ హుడా 1 రన్స్ చేశారు.

వాస్తవానికి పంజాబ్ జట్టు ఆరంభంలోనే ఇబ్బంది పడింది. ఒక పరుగుకే ఓపెనర్ మందీప్ సింగ్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన క్రిస్ గేల్.. కెప్టెన్ కేఎల్ రాహుల్‌లో కలిసి సిక్సర్ల మోత మోగించాడు. రెండో వికెట్‌కు వీరిద్దరు కలిసి 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 121 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ వస్తూ వస్తూనే సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఇక 162 పరుగుల వద్ద పూరన్ ఔట్ కావడంతో మాక్స్‌వెల్ క్రీజులోకి వచ్చాడు. ఆఖరి ఓవర్లో ఆర్చర్ బౌలింగ్లో సిక్స్ కొట్టిన గేల్ 99 పరుగులు చేశాడు. మరో షాట్‌కు ప్రయత్నించి బౌల్డ్ అవ్వడంతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బెన్‌స్టోక్స్ తలో రెండు వికెట్లు తీశారు.

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు 21 సార్లు తలపడ్డాయి. 12 సార్లు రాజస్థాన్ గెలవగా.. 9 సార్లు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇంతకు ముందు ఓసారి ఇరుజట్లు మ్యాచ్ ఆడాయి. సెప్టెంబరు 27న షార్జాలో జరిగిన మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. పంజాబ్ విధించిన 223 పరుగుల టార్గెట్‌ను కూడా చేధించింది. ఈ మ్యాచ్‌లోనూ పంజాబ్‌పై గెలిచి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది రాజస్థాన్. అంతేకాదు పాయింట్ల పట్టికలో ఏడో స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది.

వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచిన కేఎల్ రాహుల్ సేన.. ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది. జట్టులోకి గేల్ వచ్చిన తర్వాత ఆ జట్టు ఓడిపోవడం ఇదే తొలిసారి. టోర్నీలో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. ఆరు గెలిచి, మరో ఏడు ఓడిపోయింది. 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఐపీఎల్ 2020లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు.. 6 మాత్రమే గెలిచింది. మరో ఏడింట ఓటమి పాలయింది. 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.

First published:

Tags: IPL, IPL 2020, Kings XI Punjab, Rajasthan Royals

ఉత్తమ కథలు