Home /News /ipl /

KKR VS RR IPL 2020 KOLKATA KNIGHT RIDERS VS RAJASTHAN ROYALS MORGAN TEAM WON BY 60 RUNS SK

KKR vs RR, IPL 2020: ప్లేఆఫ్ రేస్‌లో కోల్‌కతా.. ఐపీఎల్ నుంచి రాజస్థాన్ ఔట్

కోల్‌కతా విజయం (Image:IPL)

కోల్‌కతా విజయం (Image:IPL)

KKR vs RR, IPL 2020: కోల్‌కతా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కాస్త పరుగులు ఎక్కువగా ఇచ్చినప్పటికీ కీలక వికెట్లు పడగొట్టి రాజస్థాన్ పతనాన్ని శాసించాడు. 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి.. 4 వికెట్లు పడగొట్టాడు కమిన్స్.

ఇంకా చదవండి ...
    KKR vs RR, IPL 2020: డూ ఆర్ డై మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్.. బౌలింగ్.. ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో అదరగొట్టి.. రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించింది. తమ ప్లేఆఫ్ అవకాశాలను నిలబెట్టుకోవడంతో పాటు.. రాజస్థాన్‌ టీమ్‌ను టోర్నీ నుంచి ఇంటికి పంపించింది కోల్‌కతా. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి ఏకంగా నాలుగో స్థానానికి వచ్చింది. దుబాయ్‌లో రాయల్స్ జట్టుపై 60 పరుగుల తేడాతో గెలిచింది మోర్గాన్ సేన. కోల్‌కతా విధించిన 192 లక్ష్యాన్ని రాజస్థాన్ చేధించలేకపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది.

    కోల్‌కతా బౌలర్ల దెబ్బకు రాజస్థాన్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. మొదటి ఐదు ఓవర్లకు 37 పరుగులు చేసి.. ఏకంగా 5 వికెట్లు కోల్పోయింది. కమ్మిన్స్ బౌలింగ్ ధాటికి రాయల్స్ బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. ఊతప్ప (6), బెన్ స్టోక్స్ (18), స్టీవ్ స్మిత్ (4), సంజూ సామ్సన్ (1), రియాన్ పరాగ్ (0)తో పూర్తిగా విఫలమయ్యారు. జోస్ బట్లర్ 35, రాహుల్ తెవాటియా 31, శ్రేయాస్ గోపాల్ 23 పరుగులతో పరవా లేదనిపించారు. వరుసగా వికెట్లు పడడం.. మరోవైపు కావలసిన రన్ రేట్ పెరగడంతో.. రాజస్థాన్ జట్టు టార్గెట్‌ను చేధించలేక బోల్తాపడింది. కీలక మ్యాచ్‌లో ఓడిపోయి.. టోర్నీ నుంచి నిష్క్రమించి.. ఇంటి బాటపట్టింది.

    కోల్‌కతా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కాస్త పరుగులు ఎక్కువగా ఇచ్చినప్పటికీ కీలక వికెట్లు పడగొట్టి రాజస్థాన్ పతనాన్ని శాసించాడు. 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి.. 4 వికెట్లు పడగొట్టాడు కమిన్స్. ఇక శివం మావి, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు తీశారు. కమ్లేష్ నాగర్‌కోటి ఒక వికెట్ సాధించాడు.

    మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. కెప్టెన్ ఇయార్ మోర్గాన్ సిక్స్‌ల మోత మోగించాడు. 38 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. శుభమాన్ గిల్ (36), రాహుల్ త్రిపాఠి (39), ఆండ్రే రస్సెల్ (25) పరవా లేదనిపించారు. నితీష్ రాణా (0), సునీల్ నరైన్ (0), దినేష్ కార్తీక్ (0) ప్యాట్ కమ్మిన్స్ (15) రాణించలేదు. కోల్‌కతా జట్టు.. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇబ్బందుల్లో పడింది. మొదటి ఓవర్లోనే నితీష్ రాణా డకౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి.. శుభమాన్‌ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. రెండో వికెట్‌కు వీరిద్దరు కలిసి 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

    ఐతే తొమ్మిదో ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది కేకేఆర్. తెవాటియా బౌలింగ్‌లో శుభమాన్ గిల్, నరైన్ ఔటయ్యారు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే త్రిపాఠి, కార్తీక్ ఫెవిలియన్ చేరారు. ఐతే రస్సెల్, మోర్గాన్ 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం మళ్లీ రెండు వికెట్లు పడినా.. ఇయాన్ మోర్గాన్ మాత్రం ధాటిగా ఆడుతూ.. జట్టుకు భారీ స్కోర్ అందించాడు. రాజస్థాన్ బౌలర్లలో రాహుల్ తెవాటియా మూడు వికెట్లు పడగొట్టాడు. కార్తీక్ త్యాగి 2, శ్రేయాస్ గోపాల్ 1, జోఫ్రా ఆర్చర్ 1 వికెట్ తీశారు.

    ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఇప్పటి వరకు 22 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. 12 సార్లు కేకేఆర్ గెలిచింది. 10 సార్లు విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇప్పటికే ఓసారి ఇరుజట్లు తలపడ్డాయి. సెప్టెంబరు 30న దుబాయ్ వేదికగా మ్యాచ్ ఆడాయి. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 37 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ రాజస్థాన్‌ను ఓడించి.. ప్లేఆఫ్స్ బరిలో నిలిచింది కోల్‌కతా.

    ఐపీఎల్ 2020 సీజన్‌లో కోల్‌కతా, రాజస్థాన్ జట్లు చెరో 14 మ్యాచ్‌లు ఆడాయి. కోల్‌కతా ఏడు మ్యాచ్‌లో గెలిచి మరో ఏడింట ఓడిపోయింది. 14 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరింది. ఇక రాజస్థాన్ జట్టు..ఆరు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. మరో ఎనిమిదింటిలో పరాజయం పాలయింది. 12 పాయింట్లతో అట్టడుగు స్థానానికి వెళ్లిపోయింది. కీలకమైన మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో ఓడిపోయి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది రాజస్థాన్.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: IPL, IPL 2020, Kolkata Knight Riders, Rajasthan Royals

    తదుపరి వార్తలు