టీమిండియా పరుగుల మెషీన్ విరాట్ కొహ్లీ.. వరల్డ్ ఫేమస్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ క్రికెటర్. వన్డే క్రికెట్లో నెంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. చిన్న వయసులోనే అద్భుతమైన ఆటతీరుతో ఎన్నో రికార్డులను బద్దలుకొట్టాడు. భవిష్యత్‌లో ఇంకెవరీకి సాధ్యం కావేమో అన్నంతగా చరిత్రను తిరగ రాస్తున్నాడు. టెస్ట్‌ల్లో 23, వన్డేల్లో 47 సెంచరీలు సాధించి.. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు మొత్తం 70 సెంచరీలు సాధించాడు విరాట్. ఇటు టెస్ట్‌లు, అటు వన్డేల్లోనూ పరుగుల వరద పారించాడు. వన్డేల్లో 11,867, టెస్టుల్లో 7240 రన్స్ స్కోర్ చేశాడు. ఇక టీ20ల్లో 2794 పరుగులు చేశాడు కొహ్లీ. అన్ని ఫార్మట్లలో 50కి పైగా సగటుతో స్టార్ బ్యాట్స్‌మెన్‌గా ఎదిగాడు. ఐతే కొహ్లీ టీమిండియాలోకి రావడానికి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు ఓ సంబంధముంది.
తేజస్వి యాదవ్ కెప్టెన్సీలోనే విరాట్ కొహ్లీ ట్యాలెంట్ బయటపడిందని బీసీసీఐ మాజీ సెలెక్టర్ దిలీప్ వెంగ్ సర్కార్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ''2000 సంవత్సరంలో ట్యాలెంట్ కమిటీని బీసీసీఐ ఏర్పాటు చేసింది. ప్రతిభ గల యువ ఆటగాళ్లను గుర్తించడం దీని ఉద్దేశం. ఆ కమిటీకి నేనే నేతృత్వం వహించాను. బ్రిజేష్ పటేల్ కూడా నాతో పాటు ఉన్నారు. ట్యాలెంటెడ్ క్రికెటర్లను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా జరిగే అండర్ 14, అండర్ 16, అండర్ 16 క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించాను. ఆ క్రమంలోనే విరాట్ కొహ్లీని తొలిసారి అండర్ 16 మ్యాచ్‌లో ముంబైపై ఆడుతుండగా చూశా. లాలూ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ కెప్టెన్సీలో అతడు ఆ మ్యాచ్ ఆడాడు. అద్భుతంగా రాణించాడు. అప్పుడే కొహ్లీ నా దృష్టిలో పడ్డాడు.'' అని పేర్కొన్నారు వెంగ్ సర్కార్.
ఆ తర్వాత ఆస్ట్రేలియా ఎమర్జింగ్ ట్రోఫీ కోసం కొహ్లీని ఎంపిక చేసినట్లు వెల్లడించారు వెంగ్ సర్కార్. న్యూజిలాండ్‌పై కొహ్లీ 123 పరుగులు చేసి జట్టును గెలిపించాడని.. అతడు టీమిండియాకు సిద్ధంగా ఉన్నాడని అప్పుడే అనిపించినట్లు పేర్కొన్నారు. కొహ్లీ మానసికంగా పరిణతి చెందిన ఆటగాడని గుర్తించాక.. టీమిండియాలో చోటు కల్పించామని తెలిపారు. విరాట్ బర్త్ డే సందర్భంగా వెంగ్ సర్కార్ ఇంటర్వ్యూను ప్రస్తావిస్తూ న్యూస్ 18 హిందీ ఓ ఆర్టికల్ రాసింది. ఆ ఆర్టికల్‌ని ట్విటర్లో షేర్ చేసిన ఆర్జేడీ పార్టీ.. తేజస్వి యాదవ్ కెప్టెన్సీలోనే విరాట్ కొహ్లీకి అదృష్టం కలిసి వచ్చిందని పేర్కొంది. తేజస్వి వల్లే కొహ్లీ ఈ స్థాయిలో ఉన్నాడన్నట్లుగా ట్వీట్ చేసింది.
तेजस्वी यादव की कप्तानी में बदली थी विराट कोहली की किस्मत!https://t.co/Xo6UBIKxHF
— Rashtriya Janata Dal (@RJDforIndia) November 5, 2020
కాగా, తేజస్వి యాదవ్ కూడా క్రికెటర్ అన్న విషయం తెలిసిందే. రంజీ ట్రోఫీల్లో జార్ఖండ్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాదు ఐపీఎల్‌లోనూ ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ తుది జట్టులో చోటు దక్కకపోవడం వల్ల ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఆ తర్వాత క్రికెట్‌ను వదిలేసి.. తండ్రి బాటలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో బీహార్ ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుత అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మహా కూటమి గెలిస్తే తేజస్వి యాదవ్ బీహార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Cricket, Tejaswi Yadav