ఐపీఎల్ 2020

  • associate partner

RCB vs SRH: ఎలిమినేటర్ పోరులో బెంగళూరు, హైదరాబాద్ ఢీ.. గెలుపెవరిది?

RCB vs SRH: గతం కంటే షేక్ జాయెద్ స్టేడియం పిచ్ మారిపోయింది. ఇక్కడ 150-160 వరకు స్కోర్ నమోదయ్యే అవకాశముంది. టాస్ గెలిచిన వారు ముందుగా బౌలింగ్ ఎంచుకొని.. చేజింగ్‌కు మొగ్గు చూపవచ్చు.

news18-telugu
Updated: November 6, 2020, 4:45 PM IST
RCB vs SRH: ఎలిమినేటర్ పోరులో బెంగళూరు, హైదరాబాద్ ఢీ.. గెలుపెవరిది?
విరాట్ కొహ్లీ, డేవిడ్ వార్నర్
  • Share this:
RCB vs SRH, Eliminator 1, IPL 2020: ఐపీఎల్ 2020 ప్లేఆఫ్స్‌లో నేడు మరో కీలక పోరు జరగనుంది. అబుదాబి వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. షేక్ జాయెద్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడనున్నాయి. ఈ పోరులో గెలిస్తేనే క్వాలిఫైయర్-2కు వెళ్తారు. లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమించి ఇంటి బాటపడతారు. ఇంతటి కీలక మ్యాచ్‌లో గెలివాలని ఇరు జట్లూ పట్టుదలతో ఉన్నాయి.

టోర్నీలో మొదట ఇబ్బందులు పడిన హైదరాబాద్ టీమ్.. లీగ్ దశలో తన చివరి మూడు మ్యాచ్‌ల్లో  మాత్రం అద్భుతంగా రాణించింది. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లను వరుసగా ఓడించి.. ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని సాధించింది. అదే ఊపుతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచి క్వాలిఫైయర్‌-2కు వెళ్లాలని భావిస్తోంది.

మరోవైపు టోర్నీలో ఆరంభంలో అదరగొట్టిన కొహ్లీ సేన లీగ్ ఆఖరులో కాస్త ఇబ్బందులు పడింది. తన చివరి నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిపోయింది. చెన్నై, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ చేతిలో పరాజయం పాలయింది. ఐతే అప్పటికే ఏడు మ్యాచ్‌లు గెలవడం.. నెట్‌రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు వెళ్లింది ఆర్సీబీ. ఈసారి ఎలాగైనా కప్ గెలవాలని పట్టుదలతో ఉన్న బెంగళూరు.. ఎలిమినేటర్‌లో హైదరాబాద్‌ను ఓడించాలని ఉవ్విళ్లూరుతోంది.

ముఖాముఖి పోరు:
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు 15 సార్లు ముఖాముఖి తలపడగా.. హైదరాబాద్ 8 సార్లు గెలిచింది. మరో 7 మ్యాచ్‌ల్లో బెంగళూరు విజయం సాధించింది. ఇక ఈ టోర్నీలో ఇంతకు ముందు రెండు సార్లు తలపడ్డాయి. చెరొక మ్యాచ్‌లో గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్నాయి. సెప్టెంబరు 21న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 10 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓడించింది. అక్టోబరు 31న షార్జా వేదికగా మ్యాచ్‌లో ఆర్సీబీని 5 వికెట్ల తేడాతో ఓడించింది ఎస్‌ఆర్‌హెచ్.

జట్ల బలాబలాలు:

ప్రస్తుతం ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఫిలిఫ్పి, పడిక్కల్, కొహ్లీ, డివిలియర్స్ రూపంలో ఆర్సీబీకి మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది.  ఓపెనర్లు బాగా రాణిస్తే.. ఆఖరులో కొహ్లీ, డివిలియర్స్ అద్భుతంగా ఫినిష్ చేయగలరు.  సుందర్, నవదీప్ సైని, సిరాజ్, చాహల్ బంతితో విజృంభిస్తే హైదరాబాద్‌ను కట్టడి చేయవచ్చు. అటు హైదరాబాద్‌ బ్యాటింగ్ లైనప్ కూడా బలంగా ఉంది.  వృద్ధిమాన్ సాహా రాకతో మరింత దూసుకెళ్తోంది. ఓపెనర్లు సాహా, వార్నర్ మరోసారి రాణిస్తే.. హైదరాబాద్ భారీ స్కోర్ చేయగలదు. మనీష్ పాండే, విలియమ్సన్, గార్గ్, హోల్డర్‌కి ధాటిగా ఆడ సామర్థ్యముంది.  ఇక బౌలింగ్‌లో సందీప్ శర్మ, నటరాజన్, రషీద్ ఖాన్ అద్భుతంగా రాణిస్తున్నారు. వీరు విజృంభిస్తే ఆర్సీబీనీ తక్కువ స్కోర్‌కే కట్టడి చేయవచ్చు.

పిచ్ కండిషన్:

గతం కంటే షేక్ జాయెద్ స్టేడియం పిచ్ మారిపోయింది. ఇక్కడ 150-160 వరకు స్కోర్ నమోదయ్యే అవకాశముంది. టాస్ గెలిచిన వారు ముందుగా బౌలింగ్ ఎంచుకొని.. చేజింగ్‌కు మొగ్గు చూపవచ్చు.

జట్లు ఇలా ఉండొచ్చు:

SRH:  డేవిడ్ వార్నర్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ప్రియంగార్గ్/అభిషేక్ శర్మ, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, టి.నటరాజన్.

RCB:  ఫిలిప్పి, దేవదత్ పడిక్కల్, విరాట్ కొహ్లీ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్ (వికెట్ కీపర్), మోయిన్ అలీ, శివం దూబె, క్రిస్ మోరిస్/ఇసురు ఉదానా, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని/షాబాజ్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్.
Published by: Shiva Kumar Addula
First published: November 6, 2020, 4:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading