news18-telugu
Updated: September 24, 2020, 8:07 AM IST
ఎంఎస్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్ (ఫైల్ ఫొటో)
రాజస్థాన్ చేతిలో చెన్నై జట్టు ఓడిపోవడానికి కారణమేంటన్న దానిపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. మహేంద్ర సింగ్ ధోనీ చేసిన తప్పుల వల్లే రాజస్థాన్ రాయల్స్ గెలిచిందని ఇప్పటికే ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. కేవలం క్రీడాభిమానులే కాదు.. మాజీ క్రికెటర్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ధోనీ కెప్టెన్సీని గౌతమ్ గంభీర్ తప్పుబట్టగా.. తాజాగా ఆ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ కూడా చేరిపోయారు. ఎంఎస్ ధోనీ చేసిన రెండు తప్పుల వల్లే రాజస్థాన్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయిందని అన్నారు. ఆ మ్యాచ్‌లో ధోనీ కెప్టెన్సీకి 10కి 4 మార్కులే ఇస్తానని స్పష్టం చేశారు సెహ్వాగ్. క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
'చివరి ఓవర్లో ధోనీ మూడు సిక్స్‌లు కొట్టిన తర్వాత చెన్నై విజయ తీరాలకు వెళ్లి ఓడిపోయిందని అందరూ అనుకుంటున్నారు. కానీ వాస్తవం వేరు. మధ్య ఓవర్లలో లక్ష్యాన్ని చేధించేందుకు ఎంఎస్ ధోనీ ఏమాత్రమూ ప్రయత్నించలేదని అనిపించింది. కీలకమైన సమయంలో ఎన్నో బంతులను వదిలేశాడు. కరన్ ఔట్ అయిన తర్వాత ధోనీ బ్యాటింగ్ చేయాల్సింది. లేదంటే జడేజాను పంపించాల్సింది. మిడిల్ ఓవర్లలో రన్ రేట్ బాగా తగ్గింది. ఆ ఓవర్లలో కొంత మెరుగైన స్కోర్ సాధించి ఉంటే. చివరి ఓవర్లో 20-22 రన్స్ అవసరం ఉండేవి. అప్పుడు ధోనీ కొట్టి సిక్స్‌లు జట్టును గెలిపించేవి. ధోనీ అద్భుతంగా ఫినిష్ చేశాడని అందరూ మెచ్చుకునేవారు. అంతేకాదు బౌలింగ్‌లోనూ ధోనీ తప్పులు చేశాడు. పరుగులు ఎక్కువగా ఇస్తున్నా జడేజా, పీయుష్ చావ్లాకు బాల్ ఇచ్చాడు. వారిద్దరి బౌలింగ్‌లోనే సంజు శాంసన్ భారీగా పరుగులు సాధించాడు. సంజూ శాంసన్‌కు స్పిన్నర్లతో బాలింగ్ వేయించి ఉండకూడదు. ఆ మ్యాచ్‌లో ధోనీ రెండు తప్పులు చేశాడు. ఒకటి శాంసన్‌కు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడం, రెండోది.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం. ఆ మ్యాచ్‌లో ధోనీ కెప్టెన్సీకి నేనిచ్చే మార్కులు. 10కి 4 మాత్రమే.' అని సెహ్వాగ్ పేర్కొన్నారు.
ఇంతకుముందు కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్, ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా ధోనీ కెప్టెన్సీని తప్పుబట్టారు. అంత భారీ టార్గెట్ ఉన్నప్పుడే కెప్టెన్ ధోనీ ఏడో స్థానంలో ఎలా వస్తారని.. బ్యాటింగ్‌లో కాస్త ముందు రావాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు. తన కంటే ముంద రుతురాజ్ గైక్వాడ్, కేదార్ జాదవ్, శామ్ కరన్‌ను పంపించడమేంటని ప్రశ్నించారు. జట్టులో రైనా లేనప్పుడు ఆ స్థానంలో ధోనీనే వెళ్లాల్సి ఉండేదని అన్నారు. మొదట్లో నెమ్మదిగా ఆడి.. చివర్లో మూడు సిక్స్‌లు కొట్టినంత మాత్రాన ఎలా ఉపయోగం లేదని విమర్శించారు గంభీర్.
SCHEDULE TIME TABLE:
మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. సంజు శామ్సన్ 74, స్టీవెన్ స్మిత్ 69 పరుగులతో అదరగొట్టారు. చివర్లో జోఫ్రా ఆర్చర్ మెరుపులు మెరిపించాడు. కేవలం 8 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. డుప్లెసిస్ మినహా (72) ఎవరూ పెద్దగా ఆడలేదు. అతడు ఒంటరి పోరాటం చేసినప్పటికీ మిగతా సభ్యుల నుంచి సహకారం లేకపోవడంతో చెన్నై ఓడిపోయింది. 14వ ఓవర్లో స్కోర్ 114/5 వద్ద ఉన్నప్పుడు ధోనీ క్రీజులోకి వచ్చినప్పటికీ దూకుడుగా ఆడలేదు. ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్ బాదినప్పటికీ అప్పటికే ఓటమి ఖరారయింది. చివరకు 16 పరుగుల తేడాతో రాజస్థాన్ జట్టు గెలిచింది.
Published by:
Shiva Kumar Addula
First published:
September 24, 2020, 8:00 AM IST