IPL 2020 | ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ రేసులో బాబా రాందేవ్

బాబా రామ్‌దేవ్ (ఫైల్ ఫోటో)

IPL 2020 Updates | సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభంకానున్న ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ ‘వీవో’తో (చైనా మొబైల్ తయారీ సంస్థ) బీసీసీఐ తెగతెంపులు చేసుకుంది. వీవో స్థానంలో కొత్త టైటిల్ స్పాన్సర్ కోసం బీసీసీఐ వెతుకులాట కొనసాగిస్తోంది.

 • Share this:
  భారత్-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఐపీఎస్ 2020పై ప్రభావాన్ని చూపుతున్నాయి. దేశంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభంకానున్న ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ ‘వీవో’తో (చైనా మొబైల్ తయారీ సంస్థ) బీసీసీఐ తెగతెంపులు చేసుకుంది. వీవో స్థానంలో కొత్త టైటిల్ స్పాన్సర్ కోసం బీసీసీఐ వెతుకులాట కొనసాగిస్తోంది. అమెజాన్ టైటిల్ స్పాన్సర్ రేసులో ఉన్నట్లు కథనాలు రాగా...తాజాగా బాబా రాందేవ్‌కు చెందిన పంతాంజలి సంస్థ కూడా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ రేసులో నిలుస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. పంతాంజలి ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తీసుకొచ్చేందుకు ఈ సంవత్సరం ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి ఎల్కే తిజరవాల ధృవీకరించినట్లు ‘ఎకనామిక్ టైమ్స్’ పత్రిక వెల్లడించింది.

  టైటిల్ స్పాన్సర్‌ ‘వీవో’‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో బీసీసీఐ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవచ్చన్న అభిప్రాయాలను బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తోసిపుచ్చారు. ఐపీఎల్ నుంచి వీవో తప్పుకున్నంత మాత్రాన బీసీసీఐకి పెద్దగా వచ్చిన నష్టమేమీ లేదని అభిప్రాయపడ్డారు. వీవో తప్పుకోవడాన్ని ఆర్థిక సంక్షోభంగా తాను చెప్పనని...తాత్కాలిక సమస్యేనని అన్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉందని...ఈ విషయంలో బీసీసీఐ వద్ద ప్లాన్ బీ ఉందని వ్యాఖ్యానించారు.

  ఐపీఎల్ టోర్నీలో టైటిల్ స్పాన్సర్‌ ద్వారా నిర్వాహకులకు భారీ ఆదాయం సమకూరుతోంది. ఇందులో బీసీసీఐ సగం మొత్తాన్ని తీసుకుంటుండగా...మిగతా సగాన్ని 8 ఫ్రాంచైజీలు సరిసమానంగా పంచుకుంటున్నాయి. 2018 నుంచి 2022 మధ్య ఐదేళ్ల కాలానికి పీఎల్ టైటిల్ స్పాన్సర్ హక్కుల కోసం వీవో...బీసీసీఐకి రూ.2190 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంటే ఒక్కో ఐపీఎల్ టోర్నీ కోసం వీవో రూ.440 కోట్లు చెల్లిస్తోంది.
  Published by:Janardhan V
  First published: