Home /News /ipl /

Ruturaj Gaikwad: రుతురాజ్ రికార్డ్.. వరుసగా 3 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్

Ruturaj Gaikwad: రుతురాజ్ రికార్డ్.. వరుసగా 3 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్

రుతురాజ్ గైక్వాడ్ (Image:IPL)

రుతురాజ్ గైక్వాడ్ (Image:IPL)

RutuRaj Gaikwad: టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్ గైక్వాడ్ 51 సగటుతో 204 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 72.

    IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా తప్పుకోవడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఆ స్టామినా ఎవరకి ఉంది? అని అందరూ చర్చించుకుంటున్న వేళ.. మొట్ట మొదటి సారి రుతురాజ్ గైక్వాడ్ పేరు బయటకు వచ్చింది. సురేష్ రైనా వెళ్తే ఏంటి.. మాకు రుతురాజ్ ఉన్నాడు.. అని చెన్నై యాజమాన్యం ప్రకటించింది. సురేష్ రైనా స్థానాన్ని భర్తీ చేసే సత్తా రుతురాజ్‌కు ఉందా అని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగానే మొదట్లో పెద్దగా రాణించలేదు రుతురాజ్ గైక్వాడ్. చెత్త ఆటతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ చివరి మూడు మ్యాచ్‌లు అద్భుతంగా ఆడి.. మూడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు గెలిచాడు.

    ఐపీఎల్‌లో మూడు వరుస మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు సాధించిన తొలి అన్‌క్యాప్డ్ (ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని క్రీడాకారుడు) బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సాధించాడు. అంతకు ముందు సెహ్వాగ్, కొహ్లీ మాత్రమే మూడుసార్లు వరుసగా MOM సాధించారు.

    ఐపీఎల్ 2020 టోర్నీలో మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడాడు రుతురాజ్ గైక్వాడ్. మొదటి మ్యాచ్‌లో 0, ఆ తర్వాతి మ్యాచ్‌లో 5 పరుగులే చేశాడు. ఆ తర్వాతి అతడిని జట్టులోకి తీసుకోలేదు. కుర్రాళ్లలో స్పార్క్ కనిపించడం లేదని అందుకే చెన్నై ప్రదర్శన బాగాలేదని ధోనీ వ్యాఖ్యానించడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. కుర్రాళ్లలో కనిపించని కసి.. కేదార్ జాదవ్, పీయూష్ చావ్లాలో కనిపించిందా? అని చాలా మంది మండిపడ్డారు. ఆ విమర్శల మధ్య రుతురాజ్‌కు మరో అవకాశం ఇచ్చాడు ధోనీ. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మరోసారి డకౌట్ అయ్యాడు రుతురాజ్. దాంతో అతడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ధోనీ చెప్పింది నిజమే.. కనీసం ఆడాలన్న ఓపిక కూడా రుతురాజ్‌కు లేదని విమర్శలు గుప్పించారు.

    ఐతే ఆ తర్వాత మ్యాచ్ నుంచి తన సత్తా ఏంటో చూపించాడు రుతురాజ్. తనని విమర్శించిన వారే ప్రశంసించేలా అద్భుతంగా రాణించాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అర్ధ సెంచరీలు చేసి.. మూడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు గెలిచాడు. మొదటి మూడు మ్యాచ్‌ల్లో 0, 5, 0 పరుగులు చేసిన రుతురాజ్... ఆ తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో 65*, 72, 62* పరుగులు చేసి శభాష్ అనిపించాడు. దాంతో రుతురాజ్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో అభిమానులు ట్వీట్ల మోత మోగిస్తున్నారు. వచ్చే ఏడాది ఐపీఎల్‌ కోసం చెన్నై జట్టుకు అద్భుతమైన ప్లేయర్ దొరికాడని ప్రశంసలు కురిపిస్తున్నారు.





    ఈ టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్ గైక్వాడ్ 51 సగటుతో 204 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 72. వచ్చే ఐపీఎల్‌లో ధోనీ, సామ్ కరన్, జడేజాతో పాటు రుతురాజ్‌ను కూడా అట్టిపెట్టుకోవాలని చెన్నై ఫ్రాంచైజీకి సూచిస్తున్నారు అభిమానులు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Chennai Super Kings, IPL, IPL 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు