ఐపీఎల్ 2020 టోర్నీలో కీలక మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. దుబాయ్ వేదికగా తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగబోతోంది. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. గ్రూప్ దశలో ఇరు జట్లు అద్భుత ప్రదర్శన కనబరిచాయి. 14 మ్యాచ్‌ల్లో ముంబై టీమ్ 9 మ్యాచ్‌లు గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 18 పాయింట్లతో ముంబై అగ్ర స్థానంలో ఉండగా... 16 పాయింట్లతో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ రెండు జట్లు ఫైనల్‌కి వెళ్లేందుకు తలపడుతున్నాయి. మరి ఇవాళ గెలవబోతున్నారు? ఇప్పుడు అంతటా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఈ ప్రశ్నలకు సమాధానం తర్వాత దొరుకుతుంది. కానీ మ్యాచ్‌కు ముందు ఈ ఐదు ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.
1. దుబాయ్‌లో టాస్ ఓడిన జట్టు ఇప్పటి వరకు గెలవలేదు. ఇక మొదట బ్యాటింగ్ చేసిన జట్లు ఎక్కువ సార్లు విజయం సాధించాయి. ఈ టోర్నీలో ఇక్కడ 24 మ్యాచ్‌లు జరగ్గా.. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 15 సార్లు గెలిచాయి. ఈ స్టేడియంలో యావరేజీ స్కోర్ 171 పరుగులు.
2. ఐపీఎల్ 2020 టోర్నీలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్ జట్లు బౌలర్లు అదరగొట్టారు. ఇరు జట్లలో ప్రమాదకరమైన బౌలర్లు ఉన్నారు. ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్లు 60 వికెట్లు పడగొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు 59 వికెట్లు సాధించారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ క్వాలిఫైయర్ మ్యాచ్ ఫలితాన్ని బౌలర్లు నిర్ణయించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
3. ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసినప్పుడు శ్రేయస్ అయ్యర్.. 9 ఇన్నింగ్స్‌ల్లో 320 పరుగులు చేశాడు. కానీ చేజింగ్ సమయంలో తక్కువ పరుగులు చేశాడు. 5 ఇన్నింగ్స్‌ల్లో 101 పరుగులు మాత్రమే సాధించాడు శ్రేయస్ అయ్యర్. అతడి స్ట్రైక్ రేట్ 100 కంటే తక్కువగా ఉండడం ముంబైకి కలిసి వచ్చే అంశం.
4. పృథ్వీ షా ఫామ్ ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. మొదటి ఐదు మ్యాచ్‌ల్లో 179 రన్స్ చేసిన పృథ్వీ షా.. ఆ తర్వాత ఏడు ఇన్నింగ్స్‌లో మాత్రం కేవలం 49 రన్స్ మాత్రమే సాధించాడు. మరి ఇవాళ అతడిని జట్టులోకి తీసుకుంటారో లేదో చూడాలి.
5. ఐపీఎల్ 2020 టోర్నీలో ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ అద్భుతంగా రాణించాడు. రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు సాధించాడు. కానీ 5 ఇన్నింగ్స్‌లో మాత్రం 10 కంటే ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు. మరి ఇవాళ్టి మ్యాచ్‌లో శిఖర్ ధావన్ ఎలా ఆడుతాడో చూడాలి. అతడి ప్రదర్శనపై ఢిల్లీ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయనడంలో ఎలాంటి సందేహాలు లేవు.