MI vs DC Qualifier 1, IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో ఇవాళ కీలక మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్ వేదికగా తొలి క్వాలిఫైయర్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్లు తలపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న ఈ రెండు జట్లు ఫైనల్‌కి వెళ్లేందుకు పోటీ పడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ టీమ్ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. ముంబై మాత్రం మూడు మార్పులు చేసింది. ప్యాటిన్సన్, ధవల్ కులకర్ణి, సౌరభ్ తివారి స్థానాల్లో బౌల్ట్, బుమ్రా, హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చారు.
జట్ల వివరాలు:
Mumbai Indians (Playing XI): రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, నాథన్ కల్టర్‌నైల్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జాస్ప్రిత్ బుమ్రా.
Delhi Capitals (Playing XI): పృథ్వీ షా, శిఖర్ ధావన్, ఆజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), మార్కుస్ స్టోయినిస్, డేనియల్ సామ్స్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కాగిసో రబడ, అన్రిచ్ నార్జీ.
ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు 26 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ముంబై 14 సార్లు విజయం సాధించగా.. ఢిల్లీ టీమ్ 12 సార్లు గెలిచింది. ఈ సీజన్లో ఇరు జట్లు ఇప్పటికే రెండు సార్లు తలపడ్డాయి. అక్టోబరు 11న జరిగిన అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై ముంబై 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత అక్టోబరు 31న జరిగిన దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ ముంబై జట్టే విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ లెక్కన ఐపీఎల్ 2020 టోర్నీలో ముంబైపై ఢిల్లీ ఒక్కసారి కూడా గెలవలేదు. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఫైనల్లో అడుగుపెట్టాలని ఢిల్లీ భావిస్తోంది. ముచ్చటగా మూడోసారి ఢిల్లీని మట్టి కరిపించి.. తామే మొదట ఫైనల్‌కు వెళ్లాలని ముంబై కూడా పట్టుదలతో ఉంది.
గ్రూప్ దశలో ఇరు జట్లు అద్భుత ప్రదర్శన కనబరిచాయి. 14 మ్యాచ్‌ల్లో ముంబై టీమ్ 9 మ్యాచ్‌లు గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 18 పాయింట్లతో ముంబై అగ్ర స్థానంలో ఉండగా... 16 పాయింట్లతో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. రెండు జట్లలోనూ ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. ఓడిపోయినా మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.