IPL 2020 MI VS DC QUALIFIER 1 LIVE CRICKET SCORE MUMBAI INDIANS VS DELHI CAPITALS ROHIT SHARMA TEAM SCORES 200 SK
MI vs DC Qualifier 1, IPL 2020: దుబాయ్‌లో దంచికొట్టిన కుర్రాళ్లు.. ముంబై భారీ స్కోర్
సూర్యకుమార్ యాదవ్ (Image:IPL)
MI vs DC Qualifier 1, IPL 2020: రోహిత్ శర్మ, పొలార్డ్ వంటి సీనియర్లు విఫలమైనా కుర్రాళ్లు అదరగొట్టారు. సూర్య, ఇషాన్, డికాక్, హార్దిక్.. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడి చేసి.. పరుగుల వరద పారించారు. డెత్ ఓవర్లలో చుక్కలు చూపించారు.
MI vs DC Qualifier 1, IPL 2020: ఐపీఎల్ 2020 క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కేక పెట్టించింది. ఢిల్లీ జట్టుపై భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, పొలార్డ్ వంటి సీనియర్లు విఫలమైనా కుర్రాళ్లు అదరగొట్టారు. సూర్య, ఇషాన్, డికాక్, హార్దిక్.. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడి చేసి.. పరుగుల వరద పారించారు. డెత్ ఓవర్లలో చుక్కలు చూపించారు. ఇషాన్ కిషన్ 55, సూర్యకుమార్ యాదవ్ 51, క్వింటన్ డికాక్ 40, హార్దిక్ పాండ్యా 37 పరుగులు చేశారు. రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్ డకౌట్ అయ్యారు. కృనాల్ పాండ్యా 13 రన్స్ చేశాడు.
వాస్తవానికి ముంబై జట్టుకు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. రెండో ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌తో కలిసి డికాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అద్భుతమైన షాట్స్ ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఐతే 8వ ఓవర్లలో డికాక్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్, సూర్య కుమార్ ఆచితూచి ఆడారు. 12వ ఓవర్లో సూర్య కుమార్ ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పొలార్డ్.. రెండు బంతులను ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కృనాల్ కూడా ఔట్ కావడంతో.. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా..మెరుపులు మెరిపించాడు. ఇషాన్ కిషన్, హార్దిక్ పోటీ పడి మరీ సిక్స్‌లు కొట్టారు. ఆఖరి ఓవర్లలో ఊచకోత కోసి.. జట్టు స్కోర్‌ను 200లకు చేర్చారు. హార్దిక్ పాండ్యా 14 బంతుల్లోనే 37 రన్స్ చేశాడు. ఇందులో 5 సిక్స్‌లు ఉన్నాయి.
ఢిల్లీ బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. రోహిత్ శర్మ, పొలార్డ్‌ను డకౌట్ చేయడంతో పాటు అద్భుతమైన ఫామ్‌లో కనిపించిన డికాక్‌ను ఔట్ చేశాడు. అన్రిచ్ నార్జీ, మార్కుస్ స్టోయినిస్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు 26 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ముంబై 14 సార్లు విజయం సాధించగా.. ఢిల్లీ టీమ్ 12 సార్లు గెలిచింది. ఈ సీజన్లో ఇరు జట్లు ఇప్పటికే రెండు సార్లు తలపడ్డాయి. అక్టోబరు 11న జరిగిన అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై ముంబై 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత అక్టోబరు 31న జరిగిన దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ ముంబై జట్టే విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ లెక్కన ఐపీఎల్ 2020 టోర్నీలో ముంబైపై ఢిల్లీ ఒక్కసారి కూడా గెలవలేదు. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఫైనల్లో అడుగుపెట్టాలని ఢిల్లీ భావిస్తోంది. ముచ్చటగా మూడోసారి ఢిల్లీని మట్టి కరిపించి.. తామే మొదట ఫైనల్‌కు వెళ్లాలని ముంబై కూడా పట్టుదలతో ఉంది.
గ్రూప్ దశలో ఇరు జట్లు అద్భుత ప్రదర్శన కనబరిచాయి. 14 మ్యాచ్‌ల్లో ముంబై టీమ్ 9 మ్యాచ్‌లు గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 18 పాయింట్లతో ముంబై అగ్ర స్థానంలో ఉండగా... 16 పాయింట్లతో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. రెండు జట్లలోనూ ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. ఓడిపోయినా మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.