HOME »NEWS » »ipl 2020 mi vs dc qualifier 1 live cricket score mumbai indians vs delhi capitals dc losses 3 wickets for 0 sk

MI vs DC: ఢిల్లీ టాప్ ఆర్డర్ ఫసక్.. ఆ ముగ్గురూ డకౌట్.. 0 కి 3 వికెట్స్

MI vs DC: ఢిల్లీ టాప్ ఆర్డర్ ఫసక్.. ఆ ముగ్గురూ డకౌట్.. 0 కి 3 వికెట్స్
బుమ్రా (Image:IPL)

MI vs DC Qualifier 1, IPL 2020: మొదటి ముగ్గురు బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా, శిఖర్ ధావన్, ఆజింక్య రహానే డకౌట్ అయ్యారు. 0 పరుగులకే మొదటి మూడు వికెట్లు కోల్పోయింది శ్రేయాస్ సేన.

  • Share this:
    MI vs DC Qualifier 1, IPL 2020: ఐపీఎల్ 2020 క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్లు కేక పెట్టిస్తున్నారు. 200 పరుగులు చేసి బ్యాట్స్‌మెన్ అదరగొడితే.. బుల్లెట్‌లాంటి బాల్స్ విసిరి ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించారు ముంబై బౌలర్లు. జాస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ దెబ్బకు ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. మొదటి ముగ్గురు బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా, శిఖర్ ధావన్, ఆజింక్య రహానే డకౌట్ అయ్యారు. 0 పరుగులకే మొదటి మూడు వికెట్లు కోల్పోయింది శ్రేయాస్ సేన. పృథ్వీ షా, రహానేను బౌల్ట్ ఔట్ చేయగా.. ధావన్‌ను బుమ్రా దెబ్బకొట్టాడు. ఇక 4వ ఓవర్లో శ్రేయాస్ అయ్యర్, 8వ ఓవర్లలో రిషబ్ పంత్ కూడా ఔట్ కావడంతో ఢిల్లీ టీమ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. భారీ స్కోర్‌ను చేధించే క్రమంలో ఆరంభంలోనే బొక్కబోర్లా పడింది.




    మొదట బ్యాటింగ్ చేసిన ముంబై టీమ్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, పొలార్డ్ వంటి సీనియర్లు విఫలమైనా కుర్రాళ్లు అదరగొట్టారు. సూర్య, ఇషాన్, డికాక్, హార్దిక్.. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడి చేసి.. పరుగుల వరద పారించారు. డెత్ ఓవర్లలో చుక్కలు చూపించారు. ఇషాన్ కిషన్ 55, సూర్యకుమార్ యాదవ్ 51, క్వింటన్ డికాక్ 40, హార్దిక్ పాండ్యా 37 పరుగులు చేశారు. రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్ డకౌట్ అయ్యారు. కృనాల్ పాండ్యా 13 రన్స్ చేశాడు.

    వాస్తవానికి ముంబై జట్టుకు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. రెండో ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌తో కలిసి డికాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అద్భుతమైన షాట్స్ ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఐతే 8వ ఓవర్లలో డికాక్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్, సూర్య కుమార్ ఆచితూచి ఆడారు. 12వ ఓవర్లో సూర్య కుమార్ ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పొలార్డ్.. రెండు బంతులను ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కృనాల్ కూడా ఔట్ కావడంతో.. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా..మెరుపులు మెరిపించాడు. ఇషాన్ కిషన్, హార్దిక్ పోటీ పడి మరీ సిక్స్‌లు కొట్టారు. ఆఖరి ఓవర్లలో ఊచకోత కోసి.. జట్టు స్కోర్‌ను 200లకు చేర్చారు. హార్దిక్ పాండ్యా 14 బంతుల్లోనే 37 రన్స్ చేశాడు. ఇందులో 5 సిక్స్‌లు ఉన్నాయి.


    ఢిల్లీ బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. రోహిత్ శర్మ, పొలార్డ్‌ను డకౌట్ చేయడంతో పాటు అద్భుతమైన ఫామ్‌లో కనిపించిన డికాక్‌ను ఔట్ చేశాడు. అన్రిచ్ నార్జీ, మార్కుస్ స్టోయినిస్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

    ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు 26 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ముంబై 14 సార్లు విజయం సాధించగా.. ఢిల్లీ టీమ్ 12 సార్లు గెలిచింది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటికే రెండు సార్లు తలపడ్డాయి. అక్టోబరు 11న జరిగిన అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై ముంబై 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత అక్టోబరు 31న జరిగిన దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ ముంబై జట్టే విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ లెక్కన ఐపీఎల్ 2020 టోర్నీలో ముంబైపై ఢిల్లీ ఒక్కసారి కూడా గెలవలేదు. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఫైనల్‌లో అడుగుపెట్టాలని ఢిల్లీ భావిస్తోంది. ముచ్చటగా మూడోసారి ఢిల్లీని మట్టి కరిపించి.. తామే మొదట ఫైనల్‌కు వెళ్లాలని ముంబై కూడా పట్టుదలతో ఉంది.


    గ్రూప్ దశలో ఇరు జట్లు అద్భుత ప్రదర్శన కనబరిచాయి. 14 మ్యాచ్‌ల్లో ముంబై టీమ్ 9 మ్యాచ్‌లు గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 18 పాయింట్లతో ముంబై అగ్ర స్థానంలో ఉండగా... 16 పాయింట్లతో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. రెండు జట్లలోనూ ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. ఓడిపోయినా మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:November 05, 2020, 22:19 IST

    टॉप स्टोरीज