IPL 2020: ప్యాంటు మరిచిపోయిన డికాక్.. గ్రౌండ్‌లో పగలబడి నవ్విన రోహిత్

క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ

IPL 2020: క్వింటన్ డికాక్ పరిస్థితిని చూసి రోహిత్ శర్మతో పాటు సహచర ముంబై ఆటగాళ్లు పగలబడి నవ్వారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Share this:
    శుక్రవారం అబుదాబిలో కోల్‌కతాపై ముంబై ఇండియన్స్ జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ముంబై ఓపెనర్ క్లింటన్ డికాక్ దంచికొట్టాడు. సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడి తమ జట్టును సునాయసంగా గెలిపించాడు. కేవలం 44 బంతుల్లోనే 78 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఐతే ఈ మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు ఓ ఆసక్తికర సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ముంబై ఓపెనర్ క్వింటన్ డికాక్ మైదానంలోకి దిగాలనే కంగారులో ప్యాంట్ మార్చుకోవడం మరిచిపోయాడు. ముంబై ఇండియన్స్ ప్యాంట్‌కు బదులు ట్రైనింగ్ ప్యాంట్‌తోనే గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు.

    తన సహచర ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి గ్రౌండ్‌లోకి వెళ్లాడు. ఐతే అతడి ప్యాంట్ వెనక భాగం ఆరెంజ్‌ రంగులో ఉండడంతో ఇతర ముంబై ఆటగాళ్లు గుర్తించి.. ఈ విషయాన్ని డికాక్‌కు చెప్పారు. ఏంటి... నేను ట్రైనింగ్ ప్యాంట్ మార్చుకోలేదా.. అని కంగారుపడిన డికాక్.. ప్యాంట్ మార్చుకునేందుకు డగౌట్ వైపు పరుగులు తీశాడు. ఐతే రోహిత్ శర్మ అతడిని ఆపి.. ఆరెంజ్ కలర్ కనిపించకుండా కవర్ చేస్తే సరిపోతుందని చెప్పాడు. దాంతో టక్ తీసి ఆరెంజ్ కలర్‌ని కవర్ చేశాడు డికాక్. అతడి పరిస్థితిని చూసి రోహిత్ శర్మతో పాటు సహచర ముంబై ఆటగాళ్లు పగలబడి నవ్వారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


    కాగా, ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ దూకుడు కొనసాగుతోంది. అబుదాబిలో కోల్‌కతాపై గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగబాకింది రోహిత్ సేన. 149 పరుగుల లక్ష్యాన్ని 16.5 ఓవర్లలో చేధించి.. సునాయస విజయం సాధించింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 44 బంతుల్లో 78 పరుగులు చేశాడు. ఈ ఇన్సింగ్స్‌లో 3 సిక్స్‌లు, 9 ఫోర్లతో కోల్‌కతా బౌలింగ్‌ను దంచికొట్టాడు డికాక్. కెప్టెన్ రోహిత్ శర్మ 35 పరుగులతో రాణించాడు. చివర్లో బిగ్ హిట్టర్ హార్దిక్ పాండ్యా మెరిశాడు. 10 బంతుల్లో 20 పరుగులు (1 సిక్స్, 3 ఫోర్లు) చేశాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివం మావి చెరో వికెట్ సాధించారు.

    మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 రన్స్ చేసింది. కమ్మిన్స్ 53 రన్స్‌తో అదరగొట్టాడు. కెప్టెన్ మోర్గాన్ 31 పరుగులతో బాధ్యాతాయుత ఇన్సింగ్స్ ఆడాడు. శుభమాన్ గిల్ 21 రన్స్ చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా స్కోర్ చేయలేదు. టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమయింది. త్రిపాఠి 7, నితీష్ రానా 5, దినేష్ కార్తీక్ 4 పరుగులే చేశారు. కేకేఆర్ టీమ్ ముందు నుంచీ వరుసగా వికెట్లు కోల్పోయింది. 11 ఓవర్లకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, కమ్మిన్స్ జోడి అద్భుతంగా ఆడి.. మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఇద్దరూ కలిసి 87 పరుగులు చేశారు. కమ్మిన్స్ కుమ్మేయడంతో కోల్‌కతా ఆ మాత్రమైనా స్కోర్ చేసింది. లేదంటే ఇంకా తక్కువ పరుగులకే పరిమితమయ్యేది.

    ఈ మ్యాచ్‌లో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది ముంబై ఇండియన్స్. 6 మ్యాచ్‌లు గెలిచి.. 12 పాయింట్లతో నెంబర్ వన్ పొజిషన్‌లో ఉంది. కోల్‌కతా టీమ్ మరో స్థానాన్ని కోల్పోయి ఫోర్త్ ప్లేస్‌కి చేరింది. ముంబై జట్టు తన తదుపరి మ్యాచ్‌ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో ఆడనుంది. ఆదివారం రాత్రి 07.30 గంటలకు ఈ మ్యాచ్ జరుగుతుంది.
    Published by:Shiva Kumar Addula
    First published: