IPL 2020: ఐపీఎల్ టోర్నీలో భాగంగా షార్జా వేదికగా జరుగుతున్న 17వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. హైదరాబాద్‌పై విరుచుకుపడిన ముంబై బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్ నమోదు చేశారు. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన 208 పరుగులు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో చెలరేగి ఆడి కెప్టెన్ రోహిత్ శర్మ (6).. ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. ఒకే ఒక్క సిక్స్ కొట్టి మొదటి ఓవర్లో ఔటయ్యాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో కీపర్ బెయిర్‌స్టోకు క్యాచ్ ఇది వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. డికాక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆచితూచి ఆడుతూనే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. డికాక్ అర్ధ సెంచరీతో అదరగొట్టాడు.
డికాక్ 67 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 27 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 31), హార్దిక్ పాండ్యా (19 బంతుల్లో28), పొలార్డ్ (13 బంతుల్లో 25), కృనాల్ పాండ్యా (4 బంతుల్లో 20) సిక్సులతో విరుచుకుపడ్డారు. వికెట్లు పడుతున్నప్పటికీ.. అనంతరం క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ హైదరాబాద్ బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో ముంబై జట్టు 208 పరుగులు చేసింది.
ఇక సన్‌రైజర్స్ బౌలింగ్‌లో సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్ రెండేసి వికెట్లు తీశారు. స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు ఒక వికెట్ దక్కింది. కాగా, ముంబై ఇండియన్స్ జట్టు ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగింది. సన్ రైజర్స్ జట్టులో మాత్రం రెండు మార్పులు చేశారు. గత మ్యాచ్‌లో గాయపడిన భువనేశ్వర్‌తో పాటు ఖలీల్ అహ్మద్ స్థానంలో సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్‌ను జట్టులోకి తీసుకున్నారు.
జట్ల వివరాలు:
ముంబై: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జేమ్స్ పాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బోల్ట్, జాస్ప్రిత్ బుమ్రా.
హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జాని బెయిర్‌స్టో (వికెట్ కీపర్), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్, టి.నటరాజన్.