KKR vs RCB, IPL 2020: అబుదాబిలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు అదరగొట్టింది. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసి సునాయసంగా గెలిచింది. 8 వికెట్ల తేడాతో కొహ్లీ సేన విజయం సాధించింది. 85 పరుగు స్పల్ప లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి.. 13.3 ఓవర్లలోనే చేధించింది. పడిక్కల్ 25 పరుగులు, గుర్‌కీరట్ సింగ్ 21, విరాట్ కొహ్లీ 18, అరోన్ ఫించ్ 16 రన్స్ చేశారు. ఓపెనర్లు ఫించ్, పడిక్కల్ శుభారంభం ఇవ్వడంతో 10 వికెట్ల తేడాతో జట్టు గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఏడో ఓవర్లో ఓపెనర్లు ఇద్దరూ ఔట్ అయ్యారు. జట్టు స్కోర్ 46 వద్ద ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఫించ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత 2 బంతులకు పడిక్కల్ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు వెళ్లాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుర్‌కీరట్, కొహ్లీ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించారు. కోల్‌కతా బౌలర్లలో ఫెర్గూసన్ ఒక వికెట్ పడగొట్టాడు.
That's a BIG WIN for #RCB here in Abu Dhabi as they beat #KKR by 8 wickets.#Dream11IPL pic.twitter.com/qgNXRFpzYE
— IndianPremierLeague (@IPL) October 21, 2020
టాస్ గెలిచిన బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 84 పరుగులు చేసింది. బెంగళూరు సిరాజ్ ధాటికి కేకేఆర్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 30 పరుగులతో పరవా లేదనిపించాడు. మిగతా అందరూ విఫలమయ్యారు. శుభమాన్ గిల్ 1, రాహుల్ త్రిపాఠి 1, నితీష్ రాణా 0, టామ్ బాంటన్ 10, దినేష్ కార్తీక్ 4, ప్యాట్ కమ్మిన్స్ 4 పరుగులు మాత్రమే చేశారు. చివర్లో కుల్దీప్ 12, ఫెర్గూసన్ 19 పరుగులు చేయడంతో.. కోల్‌కతా ఆ మాత్రమైనా స్కోర్ చేయగలిగింది. లేదంటే 50 లోపే ప్యాక్ అయ్యేది.
బెంగళూరు బౌలర్లలో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి.. మూడు వికెట్ల పడగొట్టాడు. యుజ్వేంద్ర చాహల్ 2, నవదీప్ సైని, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ సాధించారు. ఈ మ్యాచ్‌లో నాలుగు మెయిడిన్ ఓవర్లు వచ్చాయి. సిరాజ్ 2, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్ తలో మెయిడిన్ ఓవర్ వేశారు. ఐపీఎల్ చరిత్రిలో నాలుగు మెయిడిన్ ఓవర్లు నమోదవడం ఇదే తొలిసారి. ఇక ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ సంచలనం సృష్టించాడు. 4 ఓవర్లలో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు మెయిడిన్ ఓవర్లు కూడా ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో రెండు వరుస ఔవర్లను మెయిడిన్ చేసిన మొట్ట మొదటి బౌలర్‌గా రికార్డు సాధించాడు సిరాజ్. అంతేకాదు ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో విజయంతో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన కొహ్లీ సేన.. ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో మూడింటిలో ఓటమి పాలయింది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆ జట్టు 10 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా టీమ్.. 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు ఇప్పటి వరకు 26 సార్లు తలపడ్డాయి. కేకేఆర్ టీమ్ 14 సార్లు విజయం సాధించగా.. ఆర్సీబీ జట్టు 12 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఈ సీజన్లో ఇరు జట్లు రెండు సార్లు తలపడగా.. రెండు సార్లూ ఆర్సీబీయే గెలిచింది. అక్టోబరు 12న షార్జాలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై బెంగళూరు జట్టు 82 పరుగులు తేడాతో విజయం సాధించింది. కాగా, గురువారం రాత్రి దుబాయ్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL, IPL 2020, Kolkata Knight Riders, Royal Challengers Bangalore