KKR vs RCB, IPL 2020: సిరాజ్ దెబ్బకు కోల్‌కతా కకావికలం.. కొహ్లీ సేనకు స్వల్ప లక్ష్యం

ఆర్సీబీ టీమ్ (Image:IPL)

IPL 2020, Kolkata Knight Riders vs Royal Challengers Bangalore Live Score: చివర్లో కుల్దీప్ 12, ఫెర్గూసన్ 19 పరుగులు చేయడంతో.. కోల్‌కతా ఆ మాత్రమైనా స్కోర్ చేయగలిగింది. లేదంటే 50 లోపే ప్యాక్ అయ్యేది.

  • Share this:
    KKR vs RCB, IPL 2020 Live Score: అబుదాబిలో బెంగళూరు బౌలర్లు అదరగొట్టారు. బుల్లెట్ లాంటి బంతులు విసిరి కోల్‌కతా జట్టును కకావికలం చేశారు. సిరాజ్ ధాటికి కేకేఆర్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. టాస్ గెలిచిన బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 84 పరుగులు చేసింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 30 పరుగులతో పరవా లేదనిపించాడు. మిగతా అందరూ విఫలమయ్యారు. శుభమాన్ గిల్ 1, రాహుల్ త్రిపాఠి 1, నితీష్ రాణా 0, టామ్ బాంటన్ 10, దినేష్ కార్తీక్ 4, ప్యాట్ కమ్మిన్స్ 4 పరుగులు మాత్రమే చేశారు. చివర్లో కుల్దీప్ 12, ఫెర్గూసన్ 19 పరుగులు చేయడంతో.. కోల్‌కతా ఆ మాత్రమైనా స్కోర్ చేయగలిగింది. లేదంటే 50 లోపే ప్యాక్ అయ్యేది.

    బెంగళూరు బౌలర్లో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి.. మూడు వికెట్ల పడగొట్టాడు. యుజ్వేంద్ర చాహల్ 2, నవదీప్ సైని, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ సాధించారు. ఈ మ్యాచ్‌లో నాలుగు మెయిడిన్ ఓవర్లు వచ్చాయి. సిరాజ్ 2, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్ తలో మెయిడిన్ ఓవర్ వేశారు. ఐపీఎల్ చరిత్రిలో నాలుగు మెయిడిన్ ఓవర్లు నమోదవడం ఇదే తొలిసారి. ఇక ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ సంచలనం సృష్టించాడు. 4 ఓవర్లలో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు మెయిడిన్ ఓవర్లు కూడా ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో రెండు వరుస ఔవర్లను మెయిడిన్ చేసిన మొట్ట మొదటి బౌలర్‌గా రికార్డు సాధించాడు సిరాజ్.

    సిరాజ్ విధ్వంసానికి కోల్‌కతా టీమ్ విలవిల్లాడింది. 3.3 ఓవర్లలో 17 పరుగులకే కీలమైన నాలుగు వికెట్లు కోల్పోయింది. మరోవైపు నితిన్ సైని కూడా చక్కగా బౌలింగ్ చేశాడు. మూడో ఓవర్లో కోల్‌కతా ఓపెనర్ శుభమాన్ గిల్‌ను ఔట్ చేశాడు. వీరిద్దరి విజృంభణతో కేకేఆర్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఈ దెబ్బకు ఐపీఎల్‌లో అత్యల్ప స్కోర్‌కే.. మొదటి మూడు వికెట్లు కోల్పోయిన జట్ల జాబితాలో చేరిపోయింది కోల్‌కతా నైట్ రైడర్స్. అంతేకాదు ఐపీఎల్ 2020లో అతి తక్కువ పవర్ ప్లే స్కోర్ ( మొదటి ఆరు ఓవర్లు) చేసిన జట్టుగా కేకేఆర్ నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ జట్టుకు అత్యల్ప పవర్ ప్లే స్కోర్ కావడం గమనార్హం.


    అంతకుముందు అక్టోబరు 12న షార్జాలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కోల్‌కతాపై బెంగళూరు జట్టు 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీమ్ 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన కొహ్లీ సేన.. ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో మూడింటిలో ఓటమి పాలయింది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆ జట్టు 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా టీమ్.. 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
    Published by:Shiva Kumar Addula
    First published: