IPL 2020 HARBHAJAN SINGH YUVRAJ SINGH REACT TO FAILED NO BALL CALL DURING RCB VS SRH SK
IPL 2020: అది నోబాల్ కాదా? ఇదేం అంపైరింగ్? మాజీ క్రికెటర్ల సెటైర్లు
విలియమ్సన్ (Image:IPL)
IPL 2020: ప్రస్తుతం ఆ బాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏంటి అది నో బాల్ కాదా..? అని మాజీ హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, జోఫ్రా ఆర్చర్, జిమ్మీ నీషమ్ ట్వీట్ చేశారు.
షార్జాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టిన విషయం తెలిసిందే. కీలకమైన మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఐతే ఈ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బ్యాట్స్‌మెన్ నడుము కంటే ఎత్తున వెళ్లిన బంతిని కూడా అంపైర్ నోబాల్‌గా ప్రకటించకపోవడం చర్చనీయాంశమైంది. నో బాల్ అని క్లియర్‌గా కనిపిస్తున్నా.. అంపైర్ ఎందుకు ప్రకటించలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మాజీ క్రికెటర్లు కూడా అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టుతున్నారు. ప్రపంచం మొత్తానికీ నోబాల్‌గా కనిపించినప్పటికీ ఆయనకు ఎందుకు కనిపించలేదని సెటైర్లు వేస్తున్నారు.
హైదరాబాద్ బ్యాటింగ్ సమయంలో 10వ ఓవర్ ఇసురు ఉదానా బౌలింగ్ వేశాడు. ఆ ఓవర్లో నాలుగో బంతిని విలియమ్సన్ ఫేస్ చేశాడు. నడుము కంటే ఎత్తున వచ్చిన ఆ బంతిని ఫైన్ లెగ్ వైపు తరలించి సింగిల్ తీశాడు. ఐతే ఉదానా వేసిన బంతి చాలా ఎత్తుగా వచ్చినప్పటికీ.. ఫీల్డ్ అంపైర్లు కేఎన్ అనంత పద్మనాభన్, క్రిష్ణమాచారి శ్రీనివాసన్ మాత్రం నోబాల్‌గా ప్రకటించలేదు. వారు స్పందించకపోవడంతో బ్యాట్స్‌మెన్ విలియమ్సన్ కూడా షాక్ తిన్నాడు. ప్రస్తుతం ఆ బాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏంటి అది నో బాల్ కాదా..? అని మాజీ హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, జోఫ్రా ఆర్చర్, జిమ్మీ నీషమ్ ట్వీట్ చేశారు.
ఐతే ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించకపోవడం వల్ల సన్‌రైజర్స్‌పై ఎలాంటి ప్రభావం పడలేదు. ఆఖరులో హోల్డర్ మెరుపులు మెరిపించడంతో బెంగళూరుపై హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని.. 14.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించారు సన్ రైజర్స్ బ్యాట్స్‌మెన్. వృద్ధిమాన్ సాహా 39, జేసన్ హోల్డర్ 26, మనీష్ పాండే 26 పరుగులు చేశారు. వార్నర్ 8, విలియమ్సన్ 8, అభిషేక్ శర్మ 8 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు.
అంతకుముందు హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తక్కువ పరుగులకే పరిమితం చేశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేసింది. జోష్ ఫిలిప్పి 32, ఏబీ డివిలియర్స్ 24, వాషింగ్టన్ సుందర్ 21, గుర్‌కీరట్ 15 పరుగులు చేశారు. సందీప్ శర్మ, జేసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. నటరాజన్, షాబాద్ నదీమ్, రషీద్ ఖాన్ తలో వికెట్ సాధించారు.
ఐపీఎల్ 2020 టోర్నీలో సన్‌రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్ 13 మ్యాచ్‌లు ఆడాయి. బెంగళూరు 7 మ్యాచ్‌ల్లో గెలిచి.. మరో ఆరింటిలో ఓడిపోయింది. 14 పాయింట్లతో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు గెలిచింది. మరో ఏడు ఓడిపోయింది. 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇవాళ్టి మ్యాచ్‌లో గెలుపుతో ఏడో స్థానం నుంచి నాలుగో స్థానానికి వచ్చింది హైదరాబాద్. పంజాబ్, కోల్‌కతా, రాజస్థాన్‌కు కూడా 12 పాయింట్లే ఉన్నప్పటికీ.. నెట్రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో.. సన్‌రైజర్స్ నాలుగో స్థానానికి చేరింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.