news18-telugu
Updated: November 7, 2020, 8:06 AM IST
విలియమ్సన్ (Image:IPL)
IPL 2020 Eliminator, SRH vs RCB: ఐపీఎల్ 2020 ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. అబుదాబి వేదికగా చివరి ఓవర్ వరకు సాగిన ఉత్కంఠ పోరులో .. బెంగళూరును ఓడించి.. క్వాలిఫైయర్-2లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది వార్నర్ సేన. బెంగళూరు విధించిన 132 పరుగుల లక్ష్యాన్ని4 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో SRH చేధించింది. కేన్ విలియమ్సన్ 50*, మనీష్ పాండే 24, హోల్డర్ 24* పరుగులతో రాణించారు. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో.. టోర్నీ నుంచి రాయల్ ఛాలెంజర్స్ నిష్క్రమించింది.
లక్ష్య చేధనలో ఇన్నింగ్స్ ఆరంభంలోనే తడబడింది హైదరాబాద్ టీమ్. తొలి ఓవర్లోనే ఓపెనర్ శ్రీవత్స్ గోస్వామి ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మనీష్ పాండేతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు వార్నర్. వీరిద్దరు మూడో వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత ఆరో ఓవరలో వార్నర్ ఔట్ కావడంతో స్కోర్ డౌన్ అయింది. అనంతరం స్వల్ప వ్యవధిలోనే మనీష్ పాండే, గార్గ్ ఔట్ అయ్యారు. వికెట్లు పడుతున్నా..కేన్ విలియమ్స్ ఆచితూచి ఆడాడు. చివర్లో హోల్డర్‌తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇక బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 2 వికెట్లు తీశాడు. అడమ్ జంపా, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి..131 పరుగులు చేసింది. SRH బౌలర్ల ధాటికి ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. కెప్టెన్ కొహ్లీ ఓపెనింగ్ రావడం ఏ మాత్రం కలిసి రాలేదు. ఏబీ డివిలియర్స్ 56, అరోన్ ఫించ్ 32 పరుగులతో రాణించారు. మిగతా అందరూ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. విరాట్ కొహ్లీ 6, పడిక్కల్ 1, మోయిన్ అలీ 0, శివం దూబె 8, వాషింగ్టన్ సుందర్ 5 రన్స్ మాత్రమే చేశారు. సైని 9, సిరాజ్ 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఏబీ డివిలియర్స్ ఒంటరి పోరు చేసి టీమ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. లేదంటే బెంగళూరు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.
బెంగళూరు జట్టు ఇన్నింగ్స్‌లో ప్రారంభం నుంచీ ఇబ్బందులు పడింది. రెండో ఓవర్లో కొహ్లీ, నాలుగో ఓవర్లలో పడిక్కల్ ఔట్ కావడంతో స్కోర్ వేగం మందగించింది. అనంతరం ఫించ్, డివిలియర్స్ మూడో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఐతే 11 ఓవర్ నుంచి మళ్లీ వరుసగా వికెట్లు పడ్డాయి. ఆ ఓవర్లో ఫించ్, మోయిన్ అలీ ఔట్ అయ్యారు. అనంతరం స్వల్ప వ్యవధిలోనే శివం దుబే, వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ బాట పట్టారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు ఒక్కడే ధాటిగా ఆడుతూ స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లాడు డివిలియర్స్. ఐతే 18వ ఓవర్లో నటరాజన్ మంచి బ్రేక్ త్రూ అందించాడు. డేంజరస్‌గా కనిపిస్తున్న డివిలియర్స్‌ను పవర్ఫుల్ యార్కర్‌తో క్లీన్ బౌల్ట్ చేశాడు. ఏబీడీ ఔట్ కావడంతో బెంగళూరు స్కోర్ మందగించింది. చివరకు 20 ఓవర్లలో 131 పరుగులు మాత్రమే చేసింది.
హైదరాబాద్ బౌలర్లలో జేసన్ హోల్డర్ అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి కీలకమైన 3 వికెట్లు పడగొట్టాడు. ఇక నటరాజన్ 2, షాబాజ్ నదీమ్ ఒక వికెట్ తీశారు.
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు 15 సార్లు ముఖాముఖి తలపడగా.. హైదరాబాద్ 8 సార్లు గెలిచింది. మరో 7 మ్యాచ్‌ల్లో బెంగళూరు విజయం సాధించింది. ఇక ఈ టోర్నీలో ఇంతకు ముందు రెండు సార్లు తలపడ్డాయి. చెరొక మ్యాచ్‌లో గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్నాయి. సెప్టెంబరు 21న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 10 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ను ఓడించింది. అక్టోబరు 31న షార్జా వేదికగా మ్యాచ్‌లో ఆర్సీబీని 5 వికెట్ల తేడాతో ఓడించింది ఎస్ఆర్హెచ్.
ఇక, నవంబరు 8న ఐపీఎల్ క్వాలిఫైయర్-2 మ్యాచ్ జరుగుతుంది. అబుదాబి వేదికగా సన్‌రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్.. ఫైనల్లో ముంబై ఇండియన్స్‌ను ఢీకొనాల్సి ఉంటుంది.
Published by:
Shiva Kumar Addula
First published:
November 6, 2020, 11:09 PM IST