IPL 2020: వివాదంలో రాబిన్ ఉతప్ప.. బంతికి ఉమ్మిరాసి.. కెమెరాకు చిక్కాడు..

బంతికి ఉమ్మి రాస్తున్న ఉతప్ప (Image:Twitter)

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఐసీసీ కూడా పలు నిబంధనలను సవరించింది. బంతిపై ఉమ్మి రాయడాన్ని నిషేధించింది.

  • Share this:
    వరుసగా రెండు మ్యాచ్‌లను ఊపేసిన రాజస్థాన్ రాయల్స్... మూడో మ్యాచ్‌తో తేలిపోయింది. బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్, బట్లర్, ఉతప్ప, తెవాటియా ఇలా అందరూ విఫలమవడంతో టోర్నీలో తొలి పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఐతే ఈ మ్యాచ్‌లో రాబిన్ ఉతప్ప ప్రవర్తించిన తీరు వివాదాస్పదమయింది. రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బంతికి ఉమ్మిరాస్తూ.. కెమెరాకు చిక్కాడు. కోల్‌కతా ఓపెనర్ సునీల్ నరైన్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ని ఉతప్ప జారవిడిచాడు. ఆ కంగారులోనే బంతికి లాలాజలం రుద్దాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

    ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఐసీసీ కూడా పలు నిబంధనలను సవరించింది. బంతిపై ఉమ్మి రాయడాన్ని నిషేధించింది. ఐతే ఆ నిబంధనను రాబిన్ ఉతప్ప ఉల్లంఘించడం చర్చనీయాంశమైంది. గ్రౌండ్‌లో బంతికి ఫీల్డర్‌ లేదా బౌలర్ ఉమ్మి రుద్దితే అంపైర్లు కలగజేసుకొంటారు. బంతిని శానిటైజర్‌తో శుభ్రం చేయిస్తారు. మొదటి సారి చేస్తే.. ఫీల్డర్‌కు నిబంధనలను వివరిస్తారు. వరుసగా రెండుసార్లు అలాగే చేస్తే హెచ్చరిస్తారు. మూడోసారి కూడా తప్పు చేస్తే.. ప్రత్యర్థికి ఐదు పరుగులు అదనంగా ఇస్తారు.

    ఐతే రాబిన్ ఉతప్ప ఉద్దేశ్యపూర్వకంగా బంతికి ఉమ్మి రాయనట్లు తెలుస్తోంది. అలవాటులో పొరపాటుగానే జరిగినట్లు రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యులు చెబుతున్నారు. ఐనప్పటికీ నెటిజన్లు మాత్రం రాబిన్ ఉతప్పపై విమర్శలు గుప్పిస్తున్నారు. కరోనా సమయంలో జాగ్రత్తగా ఉండాలి కదా.. అంటూ చురకలంటిస్తున్నారు.

    బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో రాజస్థాన్న ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లో కోల్పోయి 174 పరుగులు చేసింది. శుభమాన్‌ గిల్ 47, మోర్గాన్, నితిన్ రానా 22, రస్సెల్ 24 పరుగులు చేశారు. కెప్టెన్ దినేష్ కార్తీక్ ఒకే ఒక్క పరుగు చేశాడు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2, రాజ్‌పూత్, ఉనద్కత్, టామ్ కరన్ తలో వికెట్ తీశారు. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు.. 20 ఎవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. మొదటి నుంచే వరుసగా వికెట్లు కోల్పోయింది. టామ్ కరన్ (54), బట్లర్ (21) మినహా ఎవరూ పెద్దగా స్కోర్ చేయలేదు. స్మిత్ 3, శాంసన్ 8, ఉతప్ప 2, పరాగ్ 1 పరుగు మాత్రమే చేశారు. కోల్‌కతా బౌలర్లలో శివమ్ మావి, నాగర్‌కోటి, వరుణ్ చక్రవరి తలో రెండు వికెట్లు తీయగా.. నరైన్, కమిన్స్, కుల్‌దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.

    ఈ ఓటమితో రాజస్థాన్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోగా.. కోల్‌కతా జట్టు రెండో స్థానానికి చేరింది. ప్రస్తుతం ఢిల్లీ కాపిటల్స్ టీమ్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. చివరి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. ఇక ఇవాళ రాత్రి ఏడున్నర గంటలకు ముంబై ఇండియన్స్ జట్టుతో పంజాబ్ జట్టు తలపడబోతోంది.
    Published by:Shiva Kumar Addula
    First published: