news18-telugu
Updated: October 10, 2020, 8:31 PM IST
గజిని లుక్‌లో ఎంఎస్ ధోనీ
మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్ సీజన్లో ఈ పేరు వింటే అభిమానులకు పూనకాలొస్తాయి. తలైవా అంటూ విజల్స్ మోత మోగిస్తారు తమిళ్ ఫ్యాన్స్. బ్యాట్ పట్టి క్రీజులోకి దిగినా.. వికెట్ల వెనక ఉండి కీపింగ్ చేసినా.. ఈలలతో గోల చేయాల్సిందే. ఐతే ఈ సీజన్లో ధోనీ ప్రదర్శన అంత మెరుగ్గా లేదు. కానీ కొత్త కొత్త గెటప్స్‌లో కనిపించి అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నాడు. ఇటీవల పొడవాటి మీసం కట్టుతో సింగంలా కనిపించి చెన్నై కెప్టెన్.. ఇప్పుడు మరో కొత్త లుక్‌లో అభిమానులకు కనవిందు చేస్తున్నాడు. దుబాయ్ వేదికగా బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో జుట్టు పూర్తిగా కత్తిరించుకొని.. గజినిలా కనిపించాడు.
ధోనీ కొత్త గెటప్ వీడియోను ఐపీఎల్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తలా కొత్త లుక్కు మీరు ఎంత రేటింగ్ ఇస్తారని ఓ ప్రశ్న అడిగింది. దానికి అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. అచ్చం గజినీ సినిమాలో సూర్య, అమీర్ ఖాన్‌లా ఉన్నాడంటూ..కొందరు ట్వీట్ చేస్తున్నారు.
మరికొందరైతే ధోనీ కొత్త లుక్‌పై సెటైర్లు వేస్తున్నారు. గజినీలానే ధోనీకి కూడా మతిమరుపు వచ్చిందని ట్రోల్ చేస్తున్నారు. బ్యాటింగ్‌లో భారీ షాట్లు కొట్టడం మర్చిపోతున్నాడని.. ఫలితంగా గత మ్యాచ్‌లో ఓటమి పాలయిందని విమర్శిస్తున్నారు.
కాగా, ఈ టోర్నీలో చెన్నై జట్టు ప్రదర్శనపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సీఎస్కే ఆరో స్థానంలో ఉంది. టోర్నీలో 6 మ్యాచ్‌లాడిన ధోనీ సేన.. 4 మ్యాచ్‌లు ఓడిపోయి.. కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. ఐపీఎల్ టోర్నీలో శుభారంభం చేసిన సీఎస్కే అదే జోరును కొనసాగించలేకపోయింది. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైపై విజయం సాధించి సత్తా చాటింది. ఐతే ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లో ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ చేతిలో వరుస ఓటములను చవిచూసింది. ఆ తర్వాత పంజాబ్‌పై ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలిచి సత్తా చాటింది. ఓపెనర్లు వాట్సన్, డుప్లెసిస్ ఇరగదీయడంతో చెన్నై జట్టు మళ్లీ ఫామ్‌లోకి వచ్చిందనుకున్నారు. కానీ ఆ మరుసటి మ్యాచ్‌లో మళ్లీ ఓడిపోయింది. కేకేఆర్‌పై 10 పరుగుల తేడాతో పరాజయం పాలయింది.
ఆ మ్యాచ్‌లో ధోనీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినప్పటికీ జట్టును గెలిపించుకోలేకపోయాడు. ఇక చివర్లో కేదార్ జాదవ్ డాట్ బాల్స్ ఎక్కువగా ఆడడంతో చెన్నై ఓటమి పాలయింది. ఆ మ్యాచ్ తర్వాత ధోనీ, జాదవ్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీకు బాల్స్ తినడం తప్ప ఇంకేం రాదంటూ విమర్శలు గుప్పించారు. రకరకాల మీమ్స్‌తో ఆటాడుకున్నారు. ఐతే ఇంత వరకు బాగానే ఉంది. కానీ కొందరు నెటిజన్లు మరింత రెచ్చిపోయి ధోనీ ఫ్యామిలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
ఇక ముందు సరిగ్గా ఆడనట్లయితే ధోనీ కూతురు జీవాపై అత్యాచారం చేసేందుకు వెనుకాడమంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. వారికి ధోనీ ఫ్యాన్స్ గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. మీరు నిజంగా ధోనీ అభిమానులైతే ఇలాంటి నీచమైన కామెంట్లు చేయరంటూ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తుండడంతో రాంచీలోని ధోనీ నివాసం వద్ద పోలీసులు భద్రత పెంచారు.
Published by:
Shiva Kumar Addula
First published:
October 10, 2020, 8:22 PM IST