CSK vs KXIP, IPL 2020: చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ తడబడింది. ఓపెనర్లు శుభారంభం ఇచ్చినప్పటికీ..అదే జోరును కొనసాగించలేక ఇబ్బందులు పడింది. ఆఖర్లో దీపక్ హుడా ఆదుకోవడంతో డీసెంట్ స్కోర్ చేయగలిగింది. టాస్ ఓడి మొదట మ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. దీపక్ హుడా అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. 30 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, మూడు సిక్స్‌లు ఉన్నాయి. కేఎల్ రాహల్ 29, మయాంగ్ అగర్వాల్ 26 రన్స్‌తో పరవా లేదనిపించారు. క్రిస్ గేల్ (12), నిఖోలస్ పూరన్ (2), మందీప్ సింగ్ (14), జిమ్మీ నీషమ్ (2) విఫలమయ్యారు.
పవర్ ప్లే ముగిసే సమయానికి పంజాబ్ జట్టు స్కోర్ 53/1. అదే జోరు చూసి.. కింగ్స్ ఎలెవన్ భారీ స్కోర్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ 62 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ ఔటైన తర్వాత స్కోర్ వేగం మందగించింది. తక్కువ వ్యవధిలోనే పూరన్, నీషమ్, గేల్, మందీప్ సింగ్ వెనుదిరగడంతో చాలా తక్కువ పరుగులు చేసింది. ఐతే 18 ఓవర్ నుంచి దీపక్ హుడా గేర్ మర్చాడు. ఆఖర్లో సిక్స్‌లు, ఫోర్లు విరుచుకుపడడం.. చివరి 3 ఓవర్లో ఏకంగా 40 పరుగులు రావడంతో.. పంజాబ్ జట్టు 153 పరుగులు చేయగలిగింది.
చెన్నై బౌలర్లలో లుండి ఎంగిడి మూడు వికెట్లు తీశాడు. శార్దుల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్, రవీంద్ర జడేజా తలో వికెట్ సాధించారు.
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు 22 సార్లు ముఖా ముఖి తలపడ్డాయి. చెన్నై 13 సార్లు విజయం సాధించగా.. పంజాబ్ టీమ్ 9 సార్లు గెలిచింది. టోర్నీలో ఇంతకు ముందు ఓసారి ఇరు జట్లు మ్యాచ్ ఆడాయి. అక్టోబరు 4న చెన్నై జట్టు 10 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి చెన్నైపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని రాహుల్ సేన భావిస్తోంది. మరోసారి పంజాబ్‌ను ఓడించి.. తమతో పాటు పంజాబ్‌ను ఇంటికి తీసుకెళ్లాలని ధోనీ సేన పట్టుదలతో ఉంది.
కాగా, ఈ సీజన్‌లో పంజాబ్, చెన్నై జట్లు చెరో 13 మ్యాచ్‌లు ఆడాయి. చెన్నై సూపర్ కింగ్స్ 5 మ్యాచ్‌లు గెలిచి... మరో 8 ఓడిపోయింది. 10 పాయింట్లతో అట్టడుగున నిలిచింది. ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్..6 మ్యాచ్‌లు గెలిచి, మరో ఏడింట ఓడిపోయింది. 12 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే పంజాబ్ ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. లేదంటే చెన్నైతో పాటు ఇంటికి వెళ్లాల్సిందే. ధోనీ సేన ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, IPL, IPL 2020, Kings XI Punjab