హోమ్ /వార్తలు /ఐపీఎల్ 2020 /

IPL 2020: ఐపీఎల్-13 ద్వారా బీసీసీఐకి కళ్లు చెదిరే ఆదాయం.. ఎంతో తెలుసా..?

IPL 2020: ఐపీఎల్-13 ద్వారా బీసీసీఐకి కళ్లు చెదిరే ఆదాయం.. ఎంతో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా నేపథ్యంలో ఐపీఎల్ ఆలస్యంగా జరిగినా.. భారత్ లో జరగకున్నా.. ప్రేక్షకులు లేకున్నా.. ఐపీఎల్ ఆదాయానికి ఏమాత్రం కొదవలేదు. ఎప్పటిలాగే ఈ యేడు కూడా ఐపీఎల్.. బీసీసీఐకి భారీ ఆదాయం తెచ్చిపెట్టింది.

  • News18
  • Last Updated :

ఐపీఎల్-13 సీజన్ ఇటీవలే ముగిసింది. ఊహించినట్టుగానే టైటిల్ ఫేవరేట్ ముంబయి ఇండియన్స్ వరుసగా రెండోసారి.. మొత్తంగా ఐదోసారి ఐపీఎల్ కప్ ఎగరేసుకుపోయింది. కరోనా నేపథ్యంలో ఆలస్యంగా జరిగినా.. భారత్ లో జరగకున్నా.. ప్రేక్షకులు లేకున్నా.. ఐపీఎల్ ఆదాయానికి ఏమాత్రం కొదవలేదు. ఎప్పటిలాగే ఈ యేడు కూడా ఐపీఎల్.. బీసీసీఐకి ఆదాయం తెచ్చిపెట్టింది. గతంతో పోల్చితే ఖర్చు తగ్గించుకున్న బీసీసీఐ... ఆదాయం మాత్రం గతం కంటే ఎక్కువగానే సంపాదించుకుంది. అదేంటి..? ప్రేక్షకులు లేకుండా ఆదాయం ఎలా వచ్చిందనుకుంటున్నారా..? అక్కడే ఉంది అసలు కిటుకు.

ఈ యేడాది ఐపీఎల్ సీజన్ ద్వారా బీసీసీఐ రూ. 4 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. టీవీ వ్యూయర్ షిప్ ఆధారంగా.. భారత క్రికెట్ బోర్డుకు ఈ ఆదాయం దక్కింది. కోవిడ్ నేపథ్యంలో మ్యాచ్ లు ఎలా నిర్వహించాలనేదానిమీద ప్రపంచ క్రికెట్ బోర్డులన్నీ తలలు పట్టుకుంటుండగా.. బీసీసీఐ మాత్రం కరోనా లోనూ ఐపీఎల్ వంటి మెగా టోర్నీని సమర్థవంతంగా నిర్వహించి దాని ద్వారా ఆదాయం పొందడం గమనార్హం.

బీసీసీఐ అధికారి ఒకరు తెలిపిన సమాచారం మేరకు.. ఐపీఎల్-13 సీజన్ ద్వారా బోర్డుకు రూ. 4 వేల కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు. ఈ ఆదాయం టీవీల వ్యూయర్ షిప్ ఆధారంగా వచ్చిందని.. గతేడాదితో పోలిస్తే ఇది 25 శాతం ఎక్కువ అని ఆయన అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రేక్షకులెవరినీ మ్యాచ్ చూడటానికి అంగీకరించకపోవడంతో.. చాలా మంది అభిమానులు టీవీలలోనే ఐపీఎల్ ను వీక్షించారని.. తద్వారా యాడ్ రెవెన్యూ పెరిగిందని ఆయన వివరించారు.

కాగా, కరోనా కాలంలో నిర్వహించిన ఈ మెగాటోర్నీలో.. సుమారు 1,800 మందికి 30 వేల ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించామని సంబంధిత అధికారి తెలిపారు. చాలా జట్లు సుమారు 50 మంది సిబ్బందితో వచ్చాయని.. వారందరికీ పరీక్షలు నిర్వహించామని అన్నారు. అత్యధికంగా ముంబయి ఇండియన్స్ నుంచి 150 మంది సభ్యులున్నారని.. వారిలో ఆటగాళ్లకు బట్టలు కుట్టే దర్జీలు, మేకప్ ఆర్టిస్ట్స్, హెయిర్ డ్రెస్సర్స్ వంటి వాళ్లు కూడా ఉన్నారు. వీరందరి కోసం దుబాయ్ లో ప్రత్యేకంగా 200 గదులను బుక్ చేశామని వివరించారు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లలో పలువురికి కరోనా సోకినపుడు బోర్డు సభ్యులు కొంత ఆందోళనకు గురయ్యారని.. కానీ తర్వాత ఎవరికీ ఇలాంటి లక్షణాలు లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారని తెలిపారు.

గత ఐపీఎల్ తో పోలిస్తే బోర్డు దాదాపు 35 శాతం వ్యయాన్ని తగ్గించిందని అన్నారు. ఐపీఎల్ నిర్వహణ కోసం.. దుబాయ్ నుంచే గాక శ్రీలంక నుంచి కూడా ఆతిథ్యం వచ్చిందని.. కానీ ఇదివరకే ఒకసారి యూఏఈలో ఐపీఎల్ జరిగినందున తాము దుబాయ్ వైపునకే మొగ్గు చూపామని ఆ అధికారి అన్నారు. కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఈ మెగా టోర్నీలో ముంబయి ఇండియన్స్ విజేతగా నిలవగా.. ఢిల్లీ క్యాపిటల్స్ రన్నరప్ గా నిలిచిన విషయం విదితమే.

First published:

Tags: Bcci, IPL, IPL 2020

ఉత్తమ కథలు