Zelenskyy Calls For Direct Talks With Putin : ఉక్రెయిన్ పై 17 రోజుల క్రితం సైనిక చర్యకు దిగిన రష్యా.. దాడులు మరింత ఉద్ధృతం చేసింది. నిప్రో, లస్క్ వైమానిక కేంద్రం, ఇవానో ఫ్రాన్కివిస్క్ నగరాల్లో రష్యా సేనలు బాంబుల వర్షం కురిపించాయి. మరియుపోల్ లో 80మందికిపైగా తలదాచుకున్న ఓ మసీదుపై దాడి జరిగినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. ఎంతమంది చనిపోయారనే విషయం తెలియాల్సి ఉందని పేర్కొంది. 34మంది చిన్నారులు సహా 86మంది టర్కీ దేశస్థులు ఈ మసీదులో తలదాచుకున్నట్లు టర్కీలోని ఉక్రెయిన్ ఎంబసీ తెలిపింది. వాయవ్య కీవ్ తోపాటు పలు నగరాల్లో ఇరుదేశాల మధ్య తీవ్రపోరాటం జరుగుతోంది. కీవ్ కు 25కిమీ సమీపానికి మాస్కో పదాతిదళాలు చేరుకున్నట్లు ప్రకటించిన ఉక్రెయిన్... పరిస్థితులు దారుణంగా ఉన్న మరియుపోల్ లో దాడులు కొనసాగటం వల్ల పౌరుల తరలింపు ప్రక్రియ నిలిచిపోయినట్లు ఆరోపించింది.
కాగా, దక్షిణ ఉక్రెయిన్ లోని మెలిటొపోల్ ను అధీనంలోకి తీసుకున్న రష్యా సైనికులు.. శుక్రవారం ఆ నగర మేయర్‌ను కిడ్నాప్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. ఆయుధాలతో వచ్చిన కొంతమంది మెలిటొపోల్ మేయర్ ఇవాన్ ఫెదొరోవ్ ను బలవంతంగా తీసుకెళ్తున్న వీడియోను ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం డిప్యూటీ హెడ్ కిరిల్ తిమోషెంకో సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. శత్రు సైనికులకు సహకరించట్లేదని అయనను అపహరించినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ కిడ్నాప్‌ను అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ధ్రువీకరించారు. మెలిటొపోల్ నగరాన్ని ఫిబ్రవరి 26నే రష్యా హస్తగతం చేసుకుంది.
ALSO READ OMG:ఒకే సారి 81మందికి ఉరిశిక్ష ..చావుకే భయాన్ని కలిగించిన సౌదీ అరేబియా
అయితే మేయర్ కిడ్నాప్ అయిన కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు చెందిన ఓ మీడియా సంస్థ శనివారం సంచలన విషయాన్ని బయటపెట్టింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ నేరుగా సమావేశం కావాలని నిర్ణయించారని, ఈ మేరకు ఓ ప్రతిపాదన కూడా పుతిన్ కు పంపినట్లు ఆ మీడియా సంస్థ పేర్కొంది. జెరూసలేం వేదికగా సమావేశమవుదామని పుతిన్ ముందు జెలెన్ స్కీ ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. ఇజ్రాయిల్ ప్రధాని నెఫ్తాలి బెన్నెట్ ను మధ్యవర్తిగా ఉండాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కోరినట్లు మీడియా సంస్థ పేర్కొంది.
మరోవైపు, రష్యా అధ్యక్షుడు పుతిన్ తో.. జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్,ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మక్రాన్ ఫోన్లో సంభాషించారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపాలనే వీరిద్దరూ పుతిన్‌కి సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Israel, Russia-Ukraine War, Vladimir Putin, Zelensky